మానవతావాది హైమన్ డార్ఫ్

12:03 - January 11, 2018

హైదరాబాద్ : నూటికో కోటికో ఒక్కరు.. హైమన్‌ డార్ఫ్‌ గురించి చెప్పుకోవాలంటే ఇదే వాక్యం సరిపోతుంది. ఎక్కడో ఇంగ్లడ్‌ దేశానికి చెందిన వ్యక్తి.. ఇండియాలో ఆదిలాబాద్‌ ఆదివాసీల బాధలకు చలించి పోయారు. అడవిబిడ్డల జీవితాలతో మమేకం అయి.. వారి బాధలను తీర్చడానికి నాటి నిజాం పాలకులకు కనువిప్పు కలిగించేందుకు సతీసమేతంగా.. అవిశ్రాంతంగా పాటుపడ్డారు సైమన్ డార్ఫ్‌. అది 1932 -40 ప్రాంతం.. హైదరాబాద్ రాజ్యంలో ఏడో నిజాం పాలన సాగుతున్న రోజులు. దొరలు, దోపడీదార్లకు వత్తాసుపలికే అధికారం యంత్రాంగం పట్టులో పాలన ఉన్న రోజులు. మైదాన ప్రాంత పల్లెల్లో ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్న కాలంలో.. మారుమూల ఆదివాసీ గూడేల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. అధికారులు.. దొరలు, వ్యాపారులు అడవిని, అడవి బిడ్డలను దోచుకోవడంపై గిరిజన పౌరుషం తిరగబడింది. కొమురంభీమ్ నేతృత్వంలో ఆదివాసీలు నాటి నిజాం సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు. జల్‌జంగ్‌జమీన్‌ నినాదంతో.. అడవిపై హక్కులు తమవేనని గర్జించారు.

1940లో జోడేఘాట్‌లో జరిగిన భీకర పోరు
అడవిబిడ్డల పోరాటాన్ని శాంతిభద్రతల సమస్యగానే చూసిన నాటి నిజాం అధికార యంత్రాంగం.. ఆదివాసీలపై సైన్యాన్ని నడిపింది. 1940లో జోడేఘాట్‌లో జరిగిన భీకర పోరులో గిరజన నేత కొమురం భీమ్‌ను మట్టుబెట్టారు. ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసినా.. అసలు ప్రభుత్వంపై ఆదివాసీల పోరాటానికి మూలలను వెదకాలని .. నిజాం పాలకులు నిర్ణయించారు. ఈ క్రమంలో 1935-36 కాలం‌లో రాక్‌ఫెలర్ ఫౌండేషన్ తరపున భారత్‌లోని ఆదివాసీలపై అధ్యయనం చేస్తున్న హైమన్‌డార్ఫ్‌ ను నాటి నిజాం సర్కార్‌ సంప్రదించింది. అప్పటికే ఈశాన్య రాష్టాల్లోని నాగాలపైనా, తర్వాత నాటి అవిభక్త మద్రాస్ రాష్ట్రం‌లోని గోదావరిజిల్లా గొండులపైనా పరిశోధనలు చేసి... నాగాలాండ్‌లో నివాస ఏర్పరచుకున్న హెమన్‌డార్ఫ్ దంపతులు... ఐదునెలల్లోనే నాగాల భాషను నేర్చుకొని ద్విభాషి సహాయం‌ లేకుండానే స్థానికులతో సంభాషించే స్థాయికి చేరుకున్నారు. నిజాం ప్రభువుల అభ్యర్థనతో ఆదిలాబాద్‌ గోండుల తిరుగుబాటుకు, వారి కష్టాలపై అధ్యయనం చేయడానకి హైమన్‌డార్ఫ్‌ ఆదిలాబాద్‌ ఏజెన్సీకి చేరుకున్నారు. దట్టమైన అడవులతో నిండివున్న మారుమూల గోండు గూడం మార్లవాయి చేరుకున్నారు హైమర్‌డార్ఫ్‌ ఆయన భార్య బేటీ డార్ఫ్‌. ' పుట్టిన ప్రతి మనిషీ అభివృద్ధికి అర్హుడే' అన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకొని హైమన్ డార్ఫ్ దంపతులు 1941లో మార్లవాయిలో అడుగుపెట్టారు.గోండుగూడేల్లో తిరుగుతూ వారి జీవినశైలితోపాటు .. వారి కష్టనష్టాలపై అధ్యయనం చేశారు. దీనికోసం హైమన్‌ దంపతులు గోండుభాషను నేర్చుకున్నారు. ఆదివాసీలతో వారి సొంతభాషలోనే మాట్లాడి మరింత దగ్గరయ్యారు. అంతేకాదు గిరిజనులకు చదువు నేర్పాలన్న పట్టుదలతో లిపిలేని ఆదివాసీల భాషకు దేవనాగరి లిపిలో గోండుభాషను అక్షబద్ధం చేశారు.

అడవిబిడ్డల ఆటపాటల్లోనూ.. పండుగల్లోనూ మమేకం
అడవిబిడ్డల ఆటపాటల్లోనూ.. పండుగల్లోనూ మమేకం అయ్యారు. మొదట వారు మొర్లవాయికి వచ్చినపుడు ఇక్కడ హైమన్‌డార్ఫ్‌ దంపతులకు మర్లవాయి గ్రామ సర్పంచ్‌ లచ్చుపటేల్‌ ఓ గుడిసెను ఏర్పాటు చేసి.. అన్ని అవసరాలు చూసుకున్నాడు. దీంతో లచ్చుపటేల్‌కు డార్ఫ్‌ దంపతులు బంధువులుగా మారిపోయారు.ఈ క్రమంలో లచ్చుపటేల్ జబ్బుతో మరణిస్తే.. డార్ఫదంపతులు తమ పురిటి బిడ్డకు లచ్చుపటేల్‌ అని పేరుపెట్టుకుని ఆదివాసీల జీవితాలతో మమేకం అయ్యారు. 1940 నంచి 43 వరకు పూర్తిగా మొర్లవాయిలోనే ఉన్న హైమన్‌డార్ఫ్‌ .. ఆతర్వాత 1956 వరకు ఆదివాసీల గూడేల్లో పర్యటిస్తూ సమగ్ర నివేదికను నిజాం ప్రభుత్వానికి అందించారు. గిరిజనుల జీవన స్థితిగతులపై తమ పరిశీలనను 3650 పేజీలలో, 100 గంటల నిడివితో చలన చిత్రాల్లోనూ, 10వేలకు పైగా ఛాయాచిత్రాలలోనూ నమోదు చేశారు హెమన్‌డెర్ఫ్ దంపతులు. దాంతో గిరిజనుల పోరాటానకి మూలాలు తెలుసుకున్న 7 నిజాం సర్కారు.. కఠినమైన గిరిజన చట్టాలను రూపొందించింది. అడవిపై హక్కులను ఆదివాసీలకే కల్పించింది. వారి విద్యాభివృద్ధి, ఆరోగ్య అవసరాల కోసం చర్యలు తీసుకుంది. ఇలా హైమన్‌డార్ఫ్‌ కృషితో నాడు రూపొందించిన అటవీ చట్టాలు నేటికీ ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి.

ఆస్ట్రీయాదేశంలోని వియెన్నానగరం..
ఆస్ట్రీయాదేశంలోని వియెన్నానగరంలో 1909 జూన్ 22న జన్మించిన క్రిష్టఫర్ వాన్‌ ఫరో హెమన్‌డర్ఫ్ వియెన్నా విశ్వవిద్యాలయం‌నుండి మానవ పరిణామ శాస్త్రం‌లో పీ హేచ్‌డీ పట్టా తీసుకున్నారు. అమెరికాలొని రాక్‌ఫెలర్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విఖ్యాత మానవ పరిణామ శాస్త్ర అధ్యాపకుడు బ్రోనిస్‌లా మాలినోవ్‌స్కి వద్ద అధ్యయనం చేశారు. గిరిజనుల అభివృధ్ధి అంటే వేష భాషలు మార్చుకొనే ఆధునీకరణ కాదనీ వారి సాంస్కృతీ సాంప్రదాయలను కొనసాగిస్తూనే విద్యార్జన ద్వారా మేధోపరమైన అభివృధ్ధిని సాధించడమనీ, తమ తదుపరి తరాలవారిని ఉన్నత తీరాలకు చేర్చదమనీ హెమన్‌డెర్ఫ్ దంపతులు చెప్పేవారు. ఇంగ్లండుకు తిరిగి వెళ్ళిన తరువాతకూడా హెమెన్‌డెర్ఫ్ దంపతులు తరచుగా మర్లవాయికి వచ్చేవారు. మరణానంతరం భౌతిక కాయాన్ని గిరిజన పద్ధతులతో మర్లవాయిలో గిరిజన లచ్చు పటేల్ సమాధి పక్కనే పూడ్చిపెట్టాలని ఎలిజబెత్ గిరిజనుల దగ్గర మాట తీసుకుంది. తర్వాత రెండు సంవత్సరాలకే ఆమె మరణించింది. ఎలిజబెత్ కోరిక మేరకు ఆత్మబంధువులైన గోండులు లచ్చు పటేల్ సమాధి పక్కనే సమాధి నిర్మించి కర్మకాండ జరిపారు. మానసికంగా కుంగిపోయిన హైమన్ డార్ఫ్ భార్య సమాధి పక్కనే తనకూ ముందుగానే సమాధి నిర్మింపజేసుకున్నాడు. 1995లో హైమన్‌డార్ఫ్‌ తుదిశ్వాస విడిచారు.

తన తల్లి బెటీ సమాధి పక్కనే
2012 ఫిబ్రవరిలో25న మర్లవాయికి చేరుకున్న డార్ఫ్‌ కుమారుడు నికోలస్‌ ఇక్కడ తన తల్లి బెటీ సమాధి పక్కనే తన తండ్రి అస్తికలను ఉంచి సమాధి నిర్మించారు. నికొలస్‌ భార్య సారా, కొడుకు హైమన్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. గిరిజన సంప్రదాయబద్ధంగా మనవడు హైమన్ డార్ఫ్ తన తాత కర్మకాండను నిర్వహించాడు. మనవడిలో తాతను చూసుకొని ఆ తరం గోండులు తన్మయత్వం చెందారు. ఏ కొమ్మకు పూసిన పువ్వు ఎటువైపు దృష్టి సారిస్తుందో, ఏ గాలికి గంధాన్ని పులుముతుందో, ఏ వానకు రాలి ఏ ప్రవాహంలో పడి, ఏ మట్టిలో కలిసిపోతుందో ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితం పువ్వులాంటిదే. డార్ఫ్ దంపతుల జీవితమే దీనికి సజీవ సాక్ష్యం. మార్లవాయి గిరిజన మానవీయతకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేక మరణించినా తామిక్కడే సమాధి కావాలనుకున్నారు. మానవ పరిణామ శాస్త్రాన్ని అధ్యయం చేసిన హైమన్‌డార్ఫ్‌ .. గొప్ప మానవతా వాదిగా గిరిజన బంధువుగా పేరొందారు. హైమన్‌డార్ఫ్‌కు ఆదివాసీ జనం ఘనంగా నివాళుర్పిస్తోంది. 

Don't Miss