ప్రభుత్వాసుపత్రి..వైద్యులు ఎక్కడ ?

14:56 - July 12, 2018

సంగారెడ్డి : అదో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి. గతేడాది 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్చారు. కోట్ల రూపాయలు వెచ్చింది అధునాతన వైద్య పరికరాలు సమకూర్చారు. కానీ సరిపడ వైద్యులను ఏర్పాటు చేయడం మరిచారు. దీంతో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉందన్నట్టూ.. అధునాతన పరికరాలు ఉన్నా... సరిపడ వైద్యులు లేక అవి నిరుపయోగంగా మారాయి. సూదిమందు పుష్కలంగా ఉన్నా.. అవి వేసే డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిపై 10టీవీ ప్రత్యేక కథనం.. సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం జోగిపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోగుల జబ్బులను నయం చేయాల్సిన ఆస్పత్రికే రోగం చేసింది. ఐదు కోట్ల రూపాయాలతో 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా ఈ హాస్పిటల్‌ను మార్చారు. ఆందోల్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌.... దీన్ని ప్రారంభించి నేటికి కరెక్ట్‌గా ఏడాది అయ్యింది. వంద పడకల ఆస్పత్రి అయిన ఇక్కడ అన్ని పరికరాలు ఉన్నాయి. అయితే అక్కడ వైద్యులు, స్టాఫ్‌ నర్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తమకు వైద్యం అందడం లేదంటూ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది. అద్దాల మేడలతో కార్పొరేట్‌ ఆస్పత్రిని తరలించే ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. ఆందోలు, పుల్కల్‌, అల్లదుర్గం, వట్పల్లి మండలాల నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. రోజుకు దాదాపు 900 నుంచి వెయ్యి మంది వరకు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తున రోగులు వస్తుంటే ఇక్కడ పనిచేస్తోంది కేవలం ముగ్గురు వైద్యులే. వాస్తవానికి ఇక్కడ 32 మంది వైద్యులు ఉండాలి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురిపై భారమంతా పడుతోంది.

ఈ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అధునాతన పరికరాలు సమకూర్చారు. ఫిజియోథెరపి, స్కానింగ్‌తోపాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇవేవీ ప్రస్తుతం పనిచేయడం లేదు. ప్రధానంగా గర్భిణీ వైద్య నిపుణులు, పిల్లల డాక్టర్లు లేకపోవడంతో మహిళలు, చిన్నారుల ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే సంగారెడ్డికి తరలిస్తున్నారు. వైద్యుల కొరతతో ఆస్పత్రిలో అధునాతన పరికరాలు ఉన్నా.. అవి నిరుపయోగంగా మారుతున్నాయి. సరిపడ సిబ్బంది లేకపోవడం విలువైన పరికరాలు తుప్పుపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి జోగిపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరతను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. సరిపడ వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

Don't Miss