కళా వెంకట్రావుకు గోతులు తవ్వుతున్న నేతలు

21:26 - July 29, 2018

శ్రీకాకుళం : ఆయనొక రాష్ట్ర మంత్రి.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు కూడా. అంతకుమించి సౌమ్యునిగా ముద్రపడిన కీలక నేత. ఇప్పుడు అలాంటి వ్యక్తి చుట్టూ వర్గ విభేదాలు చక్కర్లు కొడుతున్నాయి. వెనుక ఉన్న కొంత మంది నేతలే ఆయనకు గోతులు తవ్వుతున్నారు. అసలు ఎవరు ఆ మంత్రి. ఆయనకు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది. వాచ్‌ దిస్‌ స్టోరీ. 

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా ఉన్న నేత కిమిడి కళా వెంకట్రావు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఈయన పని చేస్తున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన మంత్రి కళా వెంకట్రావు చుట్టు ఇప్పుడు వర్గ విభేదాలు చుట్టుముట్టాయి. వెనుక ఉన్న నేతలే ఆయనకు గోతులు తవ్వుతున్నారు. కళా వెంకట్రావు గైర్హాజరైన ఓ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయనకు వ్యతిరేకంగా కొన్ని అంశాలను చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక విషయానికొస్తే ఇంచార్జి మంత్రి పితాని సత్యనారాయణకు మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి కళా వెంకట్రావు తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాజాం నియోజకవర్గంలో తనకు వ్యతరేకంగా గ్రూపులు కట్టబెడుతున్నారంటూ భారతి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఇక భారతి వ్యాఖ్యలకు వత్తాసు పలుకుతూ.. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నేతలు గుసగుసలాడుతున్నారు. నియోజకవర్గంలో తమకు సరియైన ప్రాధాన్యత దక్కడం లేదని జెడ్పిటిసి వర్గీయులు చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి అచ్చెనాయుడికి కళా వెంకట్రావుకు ఉన్న మనస్పర్థలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశమైంది. 

అయితే కళా వెంకట్రావు అలాంటి నేత కాదంటూ ఆయన వర్గీయులు.. ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు. ఎచ్చెర్లతో పాటు రాష్ట్రలోని అన్ని నియోజకవర్గాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంటే.. కొంత మంది కావాలనే బూటకపు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. 

ఇదిలా ఉంటే జిల్లా ఇంచార్జి మంత్రి కర్ర విరగకుండా.. పాము చావకుండా.. ఈ అంశాలను సందిగ్ధంలో పడేస్తున్నారు. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుంటే.. పార్టీలో చిన్నచిన్న మనస్పర్థలు సహజమని ఇంచార్జి మంత్రి పితాని చెబుతున్నారు. 

శ్రీకాకుళం జిల్లా గడచిన రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే నేతల మధ్య వర్గ విభేదాలు కొన్నిసార్లు పార్టీని బజారున పడేసేలా చేశాయి. ఇలానే 2009 ఎన్నికల్లో పరపతి కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా గతమైతే.. ప్రస్తుత పరిస్థితి ఇంతకంటే దారుణంగా తయారైంది. ఒకరుపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పార్టీని బజారుకీడుస్తున్నారు. మరోవైపు ఈ పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఇకపై ఇలాంటి పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల విభేదాలతో జిల్లా పార్టీ పరిస్థితి ఇకపై ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. 

Don't Miss