ఆ తల్లి కడుపుకోతకు 'న్యాయం' జరిగేనా?..

21:37 - April 14, 2018

జమ్ము కశ్మీర్‌ : లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి- కన్నతల్లి కన్నీరుమున్నీరైంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి సైతం కథువా ఘటనపై స్పందించింది. చిన్నారిని చంపిన వారిని ఉరితీయాలని భారత్‌ను కోరింది. కథువా ఘటనను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఖండించారు. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మౌనప్రదర్శన చేపట్టారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌
విద్వేషం, కక్ష సాధింపు అభం శుభం తెలియని ఓ చిన్నారిని బలితీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికపై మానవ మృగాలు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాయి. కథువా ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

హత్య చేసిన వారిని ప్రాణాలతో వదిలి పెట్టవద్దని తల్లి డిమాండ్
తన కూతురుపై అకృత్యానికి పాల్పడి హత్య చేసిన వారిని ప్రాణాలతో వదిలి పెట్టవద్దని చిన్నారి తల్లి కోరింది. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ప్రమాదాల్లో కోల్పోయానని.. ఇప్పుడు మూడో పాప ఇలా దూరమైందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తన బిడ్డను చంపిన వారిని ఉరితీయాలని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేశారు.

కథువా చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి
కథువా చిన్నారి హత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. దీనిని భయానక ఘటనగా అభివర్ణించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఘాతుకానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను కదిలించాయన్న గుటెర్రెస్‌... పసి ప్రాణాన్ని చిత్రవధ చేసి చంపేసిన మానవ మృగాన్ని క్షమించకూడదు.. వారిని తక్షణమే ఉరి తీసి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కథువా ఘటనను ఖండించిన పవన్‌కల్యాణ్‌
కథువా ఘటనను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆడపిల్లల జోలికి వెళ్తే వారి తోలు తీయాలని అన్నారు. కథువా ఘటనను ఖండిస్తూ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పవన్‌ మౌన ప్రదర్శన చేపట్టారు. ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలన్నారు. సింగపూర్‌ తరహాలో శిక్షలు అమలు చేయాలని అప్పుడే అందరికీ భయం పుడుతుందన్నారు.

కథువా ఘటనను తలుచుకుంటూ సన్నీలియోన్ ట్వీట్‌..
సినీనటి సన్నీ లియోన్‌ కథువా ఘటనను తలుచుకుంటూ.. చేసిన ఓ ట్వీట్‌ అందరినీ కదిలించి వేస్తోంది. తన దత్త పుత్రిక నిషా కౌర్‌ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశాన్ని ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. 'తల్లీ.. నీకు ప్రామిస్‌ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీ కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటా. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా అంటూ సన్నీలియోన్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ అందరినీ కదిలిస్తోంది.

రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఖండన
కథువా ఘటనను ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఖండించారు. పలు చోట్ల జస్టిస్‌ ఫర్‌ ఆసిఫా అంటూ క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించారు. 

Don't Miss