ట్రంప్, కిమ్ 'శాంతి' చెలిమి?!..

20:03 - June 12, 2018

సింగపూర్ : అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తమ మధ్య నెలకొన్న విభేదాలకు చరమగీతం పాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ సింగపూర్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇరు దేశాలు స్నేహ హస్తాన్ని అందుకున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించి శాంతి దిశగా అడుగు ముందుకు వేశాయి.

సింగపూర్‌ వేదికగా అమెరికా ట్రంప్‌, కిమ్‌ సమావేశం..
సింగపూర్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసింది. తాజాగా జరిగిన సమావేశం ట్రంప్‌, కిమ్‌ల మధ్య ఉద్రిక్తతలను చల్లబరచడమే కాదు...ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాయి. ఇరు దేశాలు ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశాయి.

ఇరు దేశాధినేతల కీలక ఒప్పందాలు..
శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్ష మేరకు అమెరికా, ఉత్తరకొరియాలు కొత్త సంబంధాలు నెలకొల్పుకోవడం... కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. 2018, ఏప్రిల్‌ 27 నాటి పాన్‌ముంగ్‌ జోమ్‌ తీర్మానానికి అనుగుణంగా సంపూర్ణ నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుంది. యుద్ధ ఖైదీలను వెంటనే స్వదేశానికి తిప్పిపంపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

మార్పు సాధ్యమని నిరూపించాం : ట్రంప్
కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు కానీ.. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారని, మార్పు సాధ్యమేనని తాము నిరూపించామని ఆయన చెప్పారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అణు నిరాయుధీకరణ మొదలు పెట్టిన తరువాత నార్త్ కొరియాపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొరియా ద్వీపంలో తమ సైనిక విన్యాసాలను నిలిపివేస్తామని అమెరికా ప్రకటించింది.

ఇది చారిత్రాతమ్మక సమావేశం : కిమ్
ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కిమ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ట్రంప్, కిమ్ ల భేటీ...
1950-53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. కనీసం ఫోన్‌లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరు దేశాధినేతలు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

Don't Miss