కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులను జూలై 15లోగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్‌రావు

07:59 - June 13, 2018

కరీంనగర్ : కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులను జూలై 15లోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. 4పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలని సూచించారు. మోటార్ల బిగింపు పనులూ వేగవంతం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించిన హరీశ్‌...పనులన్నీ పూర్తయ్యే వరకు ఇంజనీర్లు సైట్‌లోనే ఉండాలని ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదార్లు, ఇంజనీర్లతో హరీష్‌ సమీక్ష
తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులకు సంబంధించిన గుత్తేదారులను జూలై 15లోగా 4 పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన మోటార్ల బిగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మోటార్లకు రూఫ్‌షెడ్‌ నిర్మించాలని సూచించారు.
హెడ్‌ రెగ్యులేటర్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల హెడ్‌ రెగ్యులేటర్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హరీశ్‌ అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ గేట్లు, ట్రాన్సిట్‌ గేట్ల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అండర్‌ స్లూయిజ్‌ గేట్‌లను ముందుగా పూర్తి చేయాలని సూచించారు.  పనులన్నీ పూర్తయ్యే వరకు ఇంజనీర్లు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించారు. పనులు నిర్వహిస్తోన్న ఏజెన్సీ ఎండీలతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. యంత్ర సామాగ్రి సంఖ్యపెంచి పనులను వేగవంతం చేయాలని కోరారు. 
ప్యాకేజీ -6 టన్నెల్‌లోని సర్జ్‌పూల్‌ పనులను పరిశీలించిన హరీష్‌
ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజీ -6 టన్నెల్‌లోని సర్జ్‌పూల్‌ పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. సర్జ్‌పూల్‌ దగ్గర అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన తర్వాత రెండు పైపులను జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి  తేవాలన్నారు. ఒక్కోపంప్‌ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్‌ చేయవచ్చని.. దాదాపు 0.54 టీఎంసీని రెండుగేట్ల ద్వారా పంప్‌ చేయవచ్చన్నారు.  విద్యుత్‌ సరఫరా చేసి డ్రైరన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్యాస్‌ ఇన్సులేషన్‌ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని జూన్‌ చివరి నాటికి పూర్తి చేయాలని సీమన్స్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
 

 

Don't Miss