ఎనీ టైమ్,ఎనీ ప్లేస్ 'నో మనీ'..

21:33 - April 13, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నగదు కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఏ ఏటీఎం వద్ద చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకులకు వెళ్లినా... నగదు లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు వినియోగదారులు.

ఏనీటైమ్ నో మనీ కేంద్రాలు
హైదరాబాద్ మహా నగరంలో ఎంటీఎం కేంద్రాలకు నిర్వచనం మారిపోతుంది. ఏనీటైమ్ నో మనీ కేంద్రాలుగా మారాయి. నగరవాసులు కరెన్సీ కరవుతో అల్లాడుతున్నారు. ఏటీఎంల చుట్టూ గంటల తరబడి తిరిగినా క్యాష్‌ మాత్రం దొరకడం లేదని వాపోతున్నారు. ఓవైపు బ్యాంకులలో క్యాష్‌ లేక.. మరోవైపు ఏటీఎంలలో డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత మూతపడిన ఎటీఎంలు
పెద్దనోట్ల రద్దు తర్వాత నగరంలో చాలా ఏటీఎంలు మూతపడ్డాయి. కస్టమర్ల నుండి డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకులకు సరిపడ నగదు అందుబాటులో ఉండడం లేదు. గతంలో ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని మాత్రమే డ్రా చేసుకునే వారు... కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది, ఒకేసారి జీతమంతా డ్రా చేసుకోవడంతో.. ఏటీఎంలలో పెట్టిన క్యాష్‌ క్షణాల్లోనే ఖాళీ అవుతోంది.

నగదు కొరత తీవ్రంగా ఉందంటున్నారు బ్యాంక్‌ అధికారులు..
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత తీవ్రంగా ఉందంటున్నారు బ్యాంక్‌ అధికారులు. ఈ ఏడాది జనవరిలో నగదు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆర్బీఐ నుండి 2 వేల నోట్ల సరఫరా సెప్టెంబర్‌ నుండి ఆగిపోయిందని... కస్టమర్ల నుండి డిపాజిట్ల రూపంలో కరెన్సీ రాలేదంటున్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చేందుకు బ్యాంక్‌ అధికారులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. గత 2, 3 నెలలుగా కేరళ, మహారాష్ట్రల నుండి తెలంగాణ బ్యాంకులు నగదు తెచ్చుకుంటున్నాయి. ఆర్బీఐ అనుమతితో మహారాష్ట్ర, తిరువనంతపురం నుంచి నగదు తీసుకువచ్చి ఏటీఎంలలో క్యాష్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో పక్క రాష్ట్రాల నుంచి నగదును తీసుకువచ్చిన బ్యాంక్‌ అధికారులు... తాజాగా మళ్లీ నగదు తీసుకురాలేదు. దీంతో తిరిగి నగదు కష్టాలు మొదలయ్యాయి. నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులు పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా.. ఆర్బీఐ నుంచి తగినంత నగదు సరఫరా లేకపోవడంతో ఏటీఎం కేంద్రాల ముందు నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకులకు తగినంత నగదు అందించి కరెన్సీ కష్టాలు తీర్చాలని సామాన్యులు కోరుతున్నారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను ముందే వ్యతిరేకించినట్లు ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మోది ప్రభుత్వానికి ముందుగానే సూచించానని ఆయన వెల్లడించారు. నోట్ల రద్దు చర్యకు ముందు ప్రభుత్వంతో ఆర్‌బీఐ సంప్రదింపులు చేయలేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. కేంబ్రిడ్జిలోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూలులో ప్రసంగిస్తూ రాజన్ ఈ విషయాలు చెప్పారు. దేశంలో చలామణిలో ఉన్న 87.5 శాతం నోట్లను రద్దు చేస్తున్నప్పుడు ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని... మోది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్లే ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందని రాజన్‌ పేర్కొన్నారు. కొత్త నోట్లు అందుబాటులోకి లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అసంఘిటిత రంగంలో ఆర్థిక ప్రగతి కుంటుపడడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిఎస్‌టిని కూడా సమర్థంగా అమలు పరచడం లేదన్నారు. 

Don't Miss