గిదేమి వాన...ఎంత కష్టం..ఎంత నష్టం...

21:14 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు చోట్ల వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. తెలంగాణలో అకాల వర్షానికి పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకులో పంట నష్టపోవడంతో రైతు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి పొలం కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. రాత్రి కురిసిన వర్షానికి పది ఎకరాల పంట పనికి రాకుండా పోవడంతో తీవ్రమనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు పరిసర మండలాల్లో తెల్లవారుజాము నుండి కురిసిన భారీవర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి.. అప్పు చేసి పండించిన పంట నీరుగారిపోయిందని విలపించారు. చాలీచాలని టార్పాలిన్లు అందించారని.. మార్కెట్ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో గాలి వానకు పెద్ద మొత్తంలో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకున్నారు. కనీసం ఒక్కొక్క రైతుకు 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు ఆందోల్‌, పుల్కల్‌, వట్పల్లి, మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రాలిన మామిడి కాయలను చూసి రైతన్నలు కంట తడిపెట్టారు. ప్రభుత్వం ద్వారా తమకు ఆర్థిక సహాయం కల్పించాలని రైతులు వేడుకున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో గాలి వానకు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 300 ఎకారాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న తోటలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్థానిక అధికారులు పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బొల్లారం ఏరియాలో 7.3సెంటీమీటర్లు, కూకట్‌పల్లి, బాలానగర్‌లో 6సెంమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు సోమవారం కూడా తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

Don't Miss