రామగుండం ఎరువుల కర్మాగారం ప్రశ్నార్థకం ?

17:45 - January 10, 2018

 కరీంనగర్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నిధుల గండం పొంచివుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం 5 వేల 600 కోట్ల రూపాలయ వ్యయంతో పునర్నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టు ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదు. అంచనా వ్యయంలో 74 శాతం పెట్టుబడికి వాటాలు పూర్తయ్యాయి. మిగిలిన 26 శాతం వాటా పెట్టుబడుల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

దశాబ్దంన్నర క్రితం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నో ఉద్యమాలు, ఆందోళనల తర్వాత పునర్నిర్మానం జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు నిధుల కొరతతో సతమతమవుతోంది. రామగుండం ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ పేరును రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌గా మార్చి 2015 ఫిబ్రవరి 17న పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. చేపట్టిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో సంస్థ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరత. మొత్తం 5,600 కోట్ల అంచనా వ్యయంలో 74 శాతం పెట్టుబడుల వాటా పూర్తైంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఈఐఎల్‌ సంస్థలు 26 శాతం వాటా తీసుకున్నాయి. ఎఫ్‌సీఐ, తెలంగాణ ప్రభుత్వం చెరో 11 శాతం వాటా తీసుకున్నాయి. మిగిలిన 26 శాతం వాటా తీసుకునేందుకు ఏ సంస్థా ముందుకురాకపోవడంతో పునరుద్ధరణపై ప్రభావం చూపుతోంది. రామగుండం ఎవురుల కర్మాగారంలో సింగరేణి సంస్థ తరుపున పెట్టుబడులు పెట్టించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్లాంటు నుంచి ఉప ఉత్పత్తులుగా వచ్చే పేలుడు పదార్థాలను సింగరేణి తీసుకునే విధంగా పెట్టుబడులకు చేపట్టిన చర్యలు సఫలంకాలేదు.

వాటా దారుల కోసం సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. యూనియా, అమ్మోనియా ప్లాంటు నిర్మాణానికి సాంకేతిక సహకారం అందిస్తున్న డెన్మార్క్‌ కంపెనీలు హాల్దర్స్‌ టాప్స్‌, సైఫమ్‌లను వాటాదారులుగా మార్చేందుకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ సంస్థలకు చెందిన ముగ్గురు ప్రతినిధుల బృందం గురువారం క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నాయి. ఈ సందర్భంగా 13 శాతం పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయినా మిగిలిన 13 శాతం వాటా నిధులను ఎక్కడ నుంచి సమకూర్చుకోవాలన్న అంశంపై ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోతే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణమే శరణ్యమవుతుందన్న భావంతో రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు ఉన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్లాంటు ప్రారంభానికి మూడు నెలల ముందే గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నా... ఈ పనులు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. దీంతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. 

Don't Miss