అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా రామగుండం మున్సిపల్‌ దుకాణాల సముదాయం

16:48 - June 8, 2018

పెద్దపల్లి : దాదాపు 7 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా దుకాణాల సముదాయాన్ని నిర్మించారు రామగుండం మున్సిపల్‌ అధికారులు. నిర్మాణమైతే పూర్తి చేశారు కానీ నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగ మారింది. మందుబాబులకు నిలయంగా, పేకాటరాయుళ్లకు స్థావరంగా మారింది.  

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ.. నగరం నడిబొడ్డున నిర్మించిన మున్సిపల్‌ దుకాణాల సముదాయం గత ఐదు సంవత్సరాలుగా నిరపయోగంగా పడిఉంది. మున్సిపల్‌ సాధారణ నిధులు 6 కోట్ల 84 లక్షల రూపాయలతో  నగరం నడిబొడ్దున నిర్మించిన ఈ భవనాన్ని.. 2013 ఆగస్టులో ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా దుకాణ సముదాయంలోని షాపులను అద్దెకు తీసుకోలేదు. అద్దెరేటు పెద్ద మొత్తంలో ఉండటం, సౌకర్యాలు కూడా అంతంత మాత్రాన ఉండటంతో భవనంలో వ్యాపారం చేయాటానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. దీంతో భవనం నిరుపయోగంగా పడి ఉంది. ఇదే అదునుగా అసాంఘిక శక్తులు చెలరేగిపోయాయి. మందుబాబులు, పేకాటరాయుళ్లు తమ స్థావరంగా మార్చుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 

2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. 2013లో భవన నిర్మాణం పూర్తి కాగానే.. ఓ భూస్వామి ఈ స్థలం తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు భూస్వామికి అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో భవన స్థలాన్ని కొనుగోలు చేసి ఆర్భాటంగా ప్రారంభం చేశారు. అనంతరం వేలంపాట నిర్వహించి.. అద్దెలు స్వీకరించారు. అయితే డిపాజిట్లు పెద్ద మొత్తంలో ఉండటం, సౌకర్యాల కొరత ఉండటంతో కాంప్లెక్స్‌లో వ్యాపారం చేయాడానికి ఎవరూ ముందుకు రాలేదు. డిపాజిట్లు ఇచ్చిన వారు సైతం వారి డిపాజిట్లను వదులుకున్నారు. 

మరోవైపు ప్రజా ధనాన్ని వృథా చేశారని మున్సిపల్‌ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. భవన నిర్మాణం పూర్తి చేసి మందుబాబులకు, పేకాటరాయుళ్లకు అడ్డంగా మార్చారని.. అటువైపు వెళ్లాలంటే భయం ఉందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని కనీసం చిరు వ్యాపారులకు ఇచ్చైన అసాంఘిక శక్తులను నిలవరించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజల డిమాండ్‌పై మున్సిపల్ అధికారులు స్పందించారు. దుకాణ సముదాయం నిరుపయోగంగా ఉందన్న మాట వాస్తవమేనని మున్సిపల్ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. గతంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని.. వచ్చిన వారు వ్యాపారం నిర్వహించటం లేదని తెలిపారు. త్వరలో టెండర్లు వేసిన వారితో పాటు.. కొత్తవారిని కూడా టెండర్లు వేయటకు ఆహ్వానిస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ ప్రణాళిక పద్ధతిన జరుగుతుందని.. అందుకే ఆలస్యమవుతుందని కమిషనర్‌ చెప్పారు. ఇప్పటికైన అధికారులు తీరును మార్చుకుని ప్రజల ఇబ్బందులను తొలగిస్తారో చూడాలి.

Don't Miss