శనీశ్వరాలయంలో నొక్కేస్తున్నారు...

18:42 - November 2, 2017

తూర్పుగోదావరి : ఆలయ వ్యవహారాలు వీధికెక్కుతున్నాయి. పాలకమండలి, అధికారుల్లో విభేదాలు పెరుగుతున్నాయి. ప్రసిద్ధ శనీశ్వరాలయంగా చెప్పుకునే తూర్పుగోదావరి జిల్లా, మందపల్లి దేవస్థానంలో పరిణామాలు చర్చనీయాంశాలవుతున్నాయి. అధికారులు విచారించి ఈవో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఎంతో పేరున్న ప్రముఖ శనీశ్వరాలయం. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని ఈ శనీశ్వరాలయానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రతీ శని త్రయోదశి రోజు ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి వస్తారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల్లో సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈవో పని తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శనిత్రయోదశి సందర్భంగా శివునికి నూనెతో అభిషేకాలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు విశ్వాసంతో చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలను కొందరు ఆలయ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయిల్‌తో అభిషేకాలు కొందరు ఆన్‌లైన్‌ డబ్బులు చెల్లించి ఆలయ సిబ్బంది చేతుల మీదగా చేయించాలని కోరుతుంటారు. అలాంటి వారందరి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వాడేసిన నూనెను వినియోగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొబ్బరి తోట ఆదాయం విషయంలో కూడా ఈవో సహా మరి కొందరు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని కమిటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఇటీవల చేసిన నిర్మాణాల విషయంలో కూడా భారీగా అక్రమాలకు తెరలేపినట్టు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాల మీద పలువురు అధికారులకు ఫిర్యాదు చేశామంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

పాలకమండలి సభ్యుల ఫిర్యాదులో ఇప్పటికే హుండీ లెక్కింపులో ఆలయ సొమ్ము పక్కదారి పట్టిందన్న దానిపై విచారణ జరిపారు. కానీ ఆధారాలు లభించలేదంటూ అధికారులు వ్యవహారాన్ని మసి పూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించారని అంటున్నారు. కొందరి అక్రమాల వల్ల ఇప్పుడు ఆలయ ప్రతిష్టకే భంగం కలుగుతున్నట్టు పలువురు వాపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట వేయడానికి తగినట్టుగా పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.

Don't Miss