విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు

15:26 - July 30, 2018

శ్రీకాకుళం : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. విద్యార్ధులను పనివాళ్లుగా మార్చారు. సీఎం పర్యటన సందర్భంగా కాలేజీ గ్రౌండ్‌ను విద్యార్ధులతోనే శుభ్రం చేయించారు. ఉపాధ్యాయుల తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండగా... ఇదంతా కామన్‌ అని కొట్టిపడేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. 

చిన్నారులను చదివించాల్సిన ఉపాధ్యాయులే పనిచేయాలంటూ ఆదేశిస్తున్నారు. క్రీడాశాఖ అధికారులు కాసులకు కక్కుర్తిపడి పనివాళ్లను పెట్టుకోకుండా విద్యార్థులతో పని చేయిస్తున్నారు. ఇదంతా శ్రీకాకుళంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి, గవర్నర్ల పర్యటన నేపథ్యంలో.. ఆర్స్ట్ కాలేజీ గ్రౌండ్‌ను సుమారు 280 మంది విద్యార్థులతో ఉపాధ్యాయులు, పీఈటీలు క్లీన్‌ చేయించారు. 

శ్రీకాకులం నగరంలోని ఓ షెడ్యూల్‌ కులాల వసతిగృహానికి చెందిన విద్యార్థులను ఈ పనుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. ఇదే విషయాన్ని టెన్‌ టీవీ ప్రతినిధి ఉపాధ్యాయులను ప్రశ్నించగా.... ఇదంతా మామూలేనని... క్రీడాశాఖాదికారి ఆదేశాలతోనే విద్యార్థులతో పని చేస్తున్నామని పీఈటీ అంటున్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లలతో పనులు చేయించడంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్ధులతో పనులు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Don't Miss