టీడీపీ, బీజేపీ వార్..

21:42 - June 11, 2018

అమరావతి : పీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. రెండు పార్టీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. పోటాపోటీ ధర్నాలు, నిరసనలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తుంటే... అవినీతి, అసమర్థతకు మారుపేరు బీజేపీ అంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ముదిరిన మాటల యుద్ధం
ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందన్నది బీజేపీ నాయకుల ఆరోపణ. కమలనాథుల ఆరోపణలను టీడీపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం దగా చేసిందన్నది టీడీపీ నాయకుల వాదన. ఈ విషయాలపై రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది -కన్నా
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు, కేంద్రం ఇస్తున్న నిధుల దుర్వినియోగంపై విచారణ జరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... చంద్రబాబు ప్రభుత్వ తీరుపై కమలనాథులు విరుచుకుపడ్డారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం చంద్రబాబుకు నైజమంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. మొదట్లో కాంగ్రెస్‌, ఆ తర్వాత ఎన్టీఆర్‌, ఇప్పుడు ప్రధాని మోదీని చంద్రబాబు మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు అర్థరహితం -బుద్దా వెంకన్న
రాష్ట్రంలో ఇసుకు మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. బీజేపీ ధర్నాకు పోటీగా టీడీపీ నాయకులు కూడా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు టీడీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను బుద్దా వెంకన్న తిప్పికొట్టారు. బీజేపీ, టీడీపీ నేతల పోటాపోటీ నిరసనలతో విజయవాడ ధర్నా స్థలంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Don't Miss