టీడీపీ ఎంపీల పార్లమెంట్ వ్యూహాలు..

21:24 - July 10, 2018

అమరావతి : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ఎండగట్టేందుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎంపీలు సమాయత్తమవుతున్నారు. ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఈసారైనా పార్లమెంటు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంపీలకు లేఖ రాశారు. look.

పార్లమెంట్ వ్యూహాలపై చంద్రబాబు అధ్యక్షతన భేటీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 10 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు ఈనెల 12న చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకం
అవసరమైతే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై టీడీపీపీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. లోక్‌సభతోపాటే శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను టీడీపీ వ్యతిరేకించింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న లా కమిషన్‌కు ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. టీడీపీపీ భేటీలో దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కమలనాథులకు వ్యతిరేక పవనవాలు వీస్తున్నాయన్న అభిప్రాయంతో టీడీపీ ఉంది. దీనిని అధిగమించేందుకే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదాన్ని తెలుగుదేశం నాయకులు లేవనెత్తుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రయోగాలు విఫలమయ్యాయన్న అభిప్రాయంతో టీడీపీ ఉంది. ఈ రెండు అంశాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు... బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నారన్నది టీడీపీ వాదన. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చారని టీడీపీ నాయకులు మండిపడ్డుతున్నారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఈనెల 23 రాష్ట్రపతితో భేటీ
కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంటు వేదికగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ప్రతిపాదించిన టీడీపీ... ఇదే అంశంపై అఖిపలక్షంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలవాలని నిర్ణయించింది. కడప జిల్లాకు చెందిన అఖిలపక్ష బృందంతో ఈనెల 23న రాష్ట్రపతితో భేటీ అవుతారు. మరోవైపు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగనివ్వాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంపీలకు లేఖ రాశారు. టీడీపీ, వైపీసీ ఎంపీల ఆందోళనతో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఏ అంశంపైనా చర్చించకుండానే తుడిపెట్టుకుపోయిన నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఈ లేఖ రాశారు. సభ సజావుగా జరిగే విధంగా చూడటం ఎంపీల నైతిక బాధ్యత అన్న విషయాన్ని సుమిత్రా మహాజన్‌ గుర్తు చేశారు. పవిత్రమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందన్నారు. ఎంపీల పనితీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించారు. ఎంపీలు రాజకీయ వివాదాలను నియోజకవర్గాలకు పరిమితంచేసి... పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుమిత్రా మహాజన్‌ తన లేఖలో కోరారు. 

Don't Miss