దాతలు ఆదుకోరూ..కిక్ బాక్సర్ వేడుకోలు...

16:46 - May 6, 2018

మంచిర్యాల : ఆమె స్వప్నాన్ని ఆర్థిక సమస్యలు చిదిమేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన కిక్‌బాక్సర్‌.. మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించే క్రమంలో ఆర్థిక సమస్యతో తల్లడిల్లుతోంది. రష్యాలో జరిగే అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ధనం కోసం అభ్యర్థిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన కందుల మౌనిక కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి. నిరుపేద కుటుంబంలో పుట్టిన మౌనిక చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో.. బెల్లంపల్లికి చెందిన కరాటే గురువు భరత్ వద్ద శిక్షణ తీసుకుంది. మంచిర్యాలలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూనే తనకు ఇష్టమైన కిక్‌ బాక్సింగ్‌లో ప్రతిభను చాటుతూ వస్తోంది.

ఇష్టపడి నేర్చుకున్న కిక్ బాక్సింగ్‌లో.. మౌనిక, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. ప్రస్తుతం రష్యా దేశంలోని అనపలో మే 30 నుంచి జూన్‌ 4 వరకు జరగనున్న అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీకి అర్హత సాధించింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి పాల్గొననున్న ఏకైక క్రీడాకారిణి మౌనిక కావడం గమనార్హం. అయితే అక్కడికి వెళ్లడానికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే.. దాన్ని భరించే స్థోమత తనకు లేదని మౌనిక తల్లడిల్లుతోంది.

మౌనిక ఇప్పటి వరకు ఇరవైసార్లు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొంది. 18 బంగారు పతకాలు, 2 రజత‌‌ పతకాలు గెలుచుకుంది. 7 సార్లు మహిళల విభాగంలో గ్రాండ్ ఛాంపియన్‌ షిప్‌ సాధించింది. కిక్ బాక్సింగ్‌ పోటీల్లో రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైంది. ఇందులో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. గతేడాది ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు ఈవెంట్లలో పాల్గొని బంగారు, రజత‌ పతకాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది మౌనిక. అయితే ఆర్థిక సమస్యలు ఆమెను కుంగదీస్తున్నాయి.

రష్యాలో జరగనున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న మౌనిక... దాతల సహకారం కోసం ఎదురుచూస్తోంది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆకెనపల్లి శాఖలోని తన ఖాతా నెంబర్‌ 62314564711 కు.. విరాళాలు పంపాలని కోరుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆశయం నీరు గారిపోకుండా క్రీడాకారిణిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Don't Miss