థాయ్‌లాండ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ సుఖాంతం

08:05 - July 11, 2018

థాయ్‌లాండ్‌ : గుహలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసింది. గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో  గత 18 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 
ఉత్కంఠకు తెరపడింది..
థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న చిన్నారుల ఘటనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉదయం పది గంటలకు మూడో దశ సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూ టీం నలుగురు పిల్లలు, ఫుట్‌బాల్‌ కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
నిన్న మరో నలుగురు పిల్లలు క్షేమంగా బయటపటికి 
వాతావరణం అనుకూలించడంతో 19 మంది డైవర్లతో కూడిన రెస్క్యూ టీం ఆదివారం ప్రారంభించిన ఆపరేషన్‌ మూడురోజులకు ముగిసింది. 18 రోజులుగా గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులను ఒక్కొక్కరిగా సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఆదివారం నలుగురు పిల్లలను కాపాడగా.. సోమవారం మరో నలుగురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. 
వరదలు రావడంతో గుహలో చిక్కుకున్న పిల్లలు 
జూన్‌ 23న 16 ఏళ్ల లోపు 12 మంది పిల్లలు ఫుట్‌బాల్‌ కోచ్‌తో కలిసి థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ చూడడానికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో పిల్లలు గుహలో చిక్కుకుపోయారు. నాలుగు కిలోమీటర్లు లోనికి వెళ్లడంతో బయటపడే మార్గం లేక పిల్లలు గుహలోనే ఓ సురక్షిత ప్రాంతంలో బిక్కు బిక్కు మంటూ గడిపారు. 9 రోజుల తర్వాత బ్రిటిష్‌ గజ ఈతగాళ్లు వారి జాడను కనిపెట్టారు. గుహలో నీటి మట్టం పెరగడం, బురద కూరుకు పోవడంతో వారిని బయటకు తీసుకురావడం కత్తిమీద సాములా మారింది. పైగా పిల్లలు నీరసంగా ఉండడం, ఈత రాకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం
పిల్లలను గుహలో నుంచి బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించింది. ఈ ఆపరేషన్‌లో విదేశి నిపుణులు 50 మంది థాయ్‌లాండ్‌కు చెందిన 40 మంది పాల్గొన్నారు. విదేశీ డైవర్లు, థాయ్‌ డైవర్లు కలిసి ఓ ప్రణాళిక ప్రకారం చిన్నారులకు మాస్కులు తొడిగి, ఆక్సిజన్‌ అందించి, నీటి మధ్య తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పిల్లలను బయటకు తెచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఓ మాజీ ఆర్మీ డైవర్ గుహలోకి వెళ్లి తిరిగొచ్చే సమయంలో ఆక్సిజన్‌ కొరతతో మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. 
 

 

Don't Miss