కత్తిడౌన్‌ సమ్మెకు తెరపడింది

08:21 - June 19, 2018

గుంటూరు : ఎట్టకేలకు నాయిబ్రాహ్మణుల కత్తిడౌన్‌ సమ్మెకు తెరపడింది. ముఖ్యమంత్రితో నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నాయిబ్రాహ్మణుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించడంతో.. ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.

అనూహ్య మలుపులు తిరిగిన కత్తిడౌన్‌ సమ్మె ముగిసింది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 15వేలు కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌తో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. కాగా నాయిబ్రాహ్మణ సంఘాల జేఏసీ నేతలు సీఎంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సమ్మెవిరమించి విధుల్లోకి వెళ్ళనున్నారు.. 

ఆంధ్రప్రదేశ్‌లో నాయిబ్రాహ్మణుల సమ్మెతో రాష్ర్టవ్యాప్తంగా దేవాలయాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కేశఖండనలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నాయిబ్రాహ్మణుల వివాదం ఓ దశలో తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపించింది. వారి డిమాండ్లపై సరైన నిర్ణయం తీసుకొంటామని  దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. కానీ నిరసనకారులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు నాయిబ్రాహ్మణులు సైతం సీఎం తీరును నిరసించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని ప్రకటించారు.

అనూహ్య మలుపుల నేపథ్యంలో నాయిబ్రాహ్మణుల వివాదానికి తెరపడింది. నాయిబ్రాహ్మణుల జేఏసీ ప్రతినిధులు మరోసారి సీఎంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని నాయిబ్రాహ్మణుల జేఏసీ ఛైర్మన్‌ గుంటుమల్ల రాందాస్‌ తెలిపారు. వీలైనంత త్వరలోనే సమస్యల పరిష్కారాని సీఎం హామీ ఇవ్వడంతో సమ్మెవిరమిస్తున్నామని రాందాస్‌ పేర్కొన్నారు. 

సెక్రటేరియట్‌లో జరిగిన వ్యవహారంపై నాయిబ్రాహ్మణ జేఏసీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.  సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు ఇవ్వడంపై వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చర్చలకు కొద్దిమందిని మాత్రమే పిలిచారని, ఆందోళనకారులు ఎలా వచ్చారో తమకు తెలియదన్నారు.  తెలుగుదేశం పార్టీ మాత్రమే నాయిబ్రాహ్మణులకు న్యాయం చేసిందని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో నాయిబ్రాహ్మణుల వివాదానికి తెరపడింది. దీంతో  నాయిబ్రాహ్మణుల్లో ఆనందం వ్యక్తవవుతోంది. మరోవైపు నాయిబ్రాహ్మణులు విధుల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Don't Miss