'నిరుద్యోగ భృతి' ప్రకటన..మతలబేంటీ ?

14:55 - August 10, 2018

విజయవాడ : నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నిరుద్యోభృతి అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 2014 ఎన్నికల హామీ నేపథ్యంలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని సర్కార్ ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కేవలం వెయ్యితో సరిపెట్టడం సబబుకాదని.. ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ 2014 అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గంపెడు ఆశలు కల్పించారు. 'బాబు వస్తే జాబొస్తుందంటూ.. నిరుద్యోగ భృతి కల్పిస్తామని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులంతా తమకు భృతి అందుతుందని ఆశపడ్డారు. ప్రభుత్వం ఆ స్కీమ్‌ను అమలు చేయకపోవడంతో భృతి కోసం నాలుగున్నరేళ్లుగా వేచిచూస్తున్నారు. రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంది. అదికూడా వెయ్యిరూపాయలే ఇస్తామని ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ ఆశలు ఆవిరిచేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చే వెయ్యికి సవాలక్ష షరతులు విధించి కొందరికే ఆ అవకాశాన్ని కల్పించడంపట్ల యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్లపాటు మొక్కుబడిగా అదిగో ఇదిగో అంటూ మాయమాటలతో కాలం గడిపి.. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భృతి అందించాలనుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
కృష్ణా జిల్లాలో 2.71 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 71 వేల మంది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో తమ పేర్ల నమోదు చేసుకోగా, పేర్లు నమోదు కానివారు సుమారు 2 లక్షల పైచిలుకు ఉంటారని విద్యావంతులు అంచనా వేశారు. అయితే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ తదితర విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎక్కువమందే ఉన్నారు. వీరిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు విద్యకు దూరమౌతుండగా, మరికొందరు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. అర్హత ఉన్నవారు సిఫార్సులు లేనికారణంగా నిరాశ చెందుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ విద్యార్ధి నేతలు మండిపడుతున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్ నాటికి..సీఎం యువ నేస్తం' పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించి 15 రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 12న ఈ వెబ్ సైట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగించి 'సీఎం యువ నేస్తం' పథకాన్ని అమలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో సమాచారం సేకరించి, ఆధార్ అనుసంధానం ఆధారంగా రిజిస్ట్రేషన్లను పకడ్బందీగా నిర్వహిస్తారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నమోదైన రిజిస్ట్రేషన్లనే ఆన్ లైన్ స్వీకరిస్తోంది.

22 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, డిగ్రీ లేదా పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తిస్తామన్నారు అధికారులు. ఎంపికైన వారికి నెలకు వెయ్యి చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. వీరందరికీ 600 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని లెక్కకట్టారు. ఏదైనా సంస్థలో పనిచేస్తూ.. పీఎఫ్ కట్ అవుతున్నవారు లేదా...ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి కింద రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించనున్నారు. అయితే ప్రతినెలా అర్హులైన విద్యార్ధుల వేలిముద్రలు తీసుకుని బ్యాంక్ ఎకౌంట్లలో ఈ మొత్తాన్ని జమచేయనున్నారు. 

Don't Miss