నిర్మల్ జిల్లాలో ఆటవిక చర్యలు

09:13 - January 11, 2018

నిర్మల్ : జిల్లా కడం మండలం నవాబ్‌ పేట్‌లో దారుణం వెలుగుచూసింది. కులాంత వివాహం చేసుకుందన్న కక్షతో ఆమె అక్కను కులం నుంచి బహిష్కరించారు. కరీంనగర్‌కు చెందిన ముస్కె లత... మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కార్తీక్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. లత బెస్త కులానికి చెందిన అమ్మాయికాగా.... కార్తీక్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. లత అక్క జ్యోతి నిర్మల్‌ జిల్లా కడం మండలంలోని నవాబ్‌పేట్‌లో నివాసముంటోంది. జ్యోతి భర్త ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అయితే జ్యోతి ఇంటి దగ్గరే ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తన చెల్లెలు లత ప్రేమ వివాహం చేసుకుందని తెలిసిన జ్యోతి... వారిని తన ఇంటికి ఆహ్వానించింది.

వాహనంలోంచి కిందకు దించేశారు...
తన చెల్లెలు, మరిది ఇంటికి వచ్చిన రోజే గ్రామంలో వనభోజనాలు జరుగుతున్నాయి. దీంతో జ్యోతి కులస్తులు వనభోజనాలకు రావాలంటూ ఆహ్వానించారు. తీరా బయల్దేరే సమయంలో మీ చెల్లి కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని... మాతో రావొద్దంటూ వాహనంలోంచి కిందకు దించేశారు. అంతటితో ఆగకుండా కులం నుంచి బహిష్కరించారు. జ్యోతితో ఎవరైనా మాట్లాడితే 5వేలు జరిమానా వసూలు చేస్తామంటూ ఆంక్షలు విధించారు. తమకు న్యాయం చేయాలని కులపెద్దలను బాధితురాలు జ్యోతి వేడుకుంది. కుల సంఘానికి 20 వేల రూపాయలు చెల్లిస్తే... గ్రామ బహిష్కరణ రద్దు చేస్తామని వారు చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేదని ఎంత ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు... చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

గ్రామాల్లో కులజాఢ్యం రాజ్యమేలుతూ
తమ కుటుంబాన్ని బహిష్కరించారని జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేసిందని ఖానాపూర్‌ సీఐ తెలిపారు.ఈ విషయంపై గ్రామంలో విచారణ జరిపి.. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు. దేశం ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే... మరోవైపు గ్రామాల్లో కులజాఢ్యం రాజ్యమేలుతూనే ఉంది. ఆటవిక న్యాయం కొనసాగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు వచ్చినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా గ్రామాల్లో కుల బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కులం పేరుతో జరిగే దాడులు, బహిష్కరణలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Don't Miss