విజయనగరం జిల్లాలో యాక్టివ్‌ అవుతున్న వైసీపీ శ్రేణులు

12:58 - June 13, 2018

విజయనగరం : సార్వత్రిక ఎన్నికల్లు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు యాక్టివ్‌ అవుతున్నారు. నాలుగేళ్లలో కేవలం అధికార పార్టీపై విమర్శలకే పరిమితమైన వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే  ప్రభుత్వ పథకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

2014 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ నేతలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో తొమ్మిది సీట్లకు గాను కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకున్న ఆ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ మూడు సీట్లను గెలుచుకున్నప్పటికీ... బొబ్బిలిరాజు సుజయకృష్ణ రంగారావు టీడీపీకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో...  రంగారావు టీడీపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సుజయకృష్ణ రంగారావు కొనసాగుతున్నారు. బొత్స వైసీపీలో చేరిన తర్వాత పార్టీ కొంత బలోపేతమయ్యింది. కానీ పార్టీ కేడర్‌లో మాత్రం చురుకుదనం కనిపించడం లేదు. 

ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి, బొత్సకు మధ్య ఉన్న వర్గ విభేదాలు మొదట్లో పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురి చేసినా..  ఇటీవల కాలంలో ఈ రెండు వర్గాల మధ్య కొంత సమన్వయం రావడంతో పార్టీ ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టిని బలోపేతం చేసేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ పథకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలు వెలికి తీయడం, అధికార పార్టీ నేతల అక్రమాలను ఎండగడుతూ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అధికార పార్టీ టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బొబ్బిలి నియోజకవర్గంలో సీనియర్‌ టీడీపీ నేత శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడును వైసీపీలో చేరే విధంగా ప్రయత్నించి విజయం సాధించారు... జగన్‌ సమక్షంలో శంబంగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడగట్టడం, వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడం వంటి చర్యలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా సాలూరు, బొబ్బొలి, గజపతినగరం, చీపురుపల్లి  నియోజకవర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీని బలహీనపర్చే విధంగా చిన్న శ్రీను పావులు కదుపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సైతం తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాలతో నిత్యం ఆయన సమావేశాలను నిర్వహిస్తూ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. 

మొత్తానికి 2014 ఎన్నికల్లో అపజయాలపై వైసీపీ నేతలు తీవ్రంగానే దృష్టి సారించారనే విషయం స్పష్టమవుతోంది. ఇందుకోసమే వైసీపీ శ్రేణులు కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ... పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు.. మరి వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు విజయమంతమవుతాయో వేచి చూడాలి

Don't Miss