తెలంగాణకు నాలుగేళ్లు..సంబరాలు దేనికోసం ?

21:05 - June 2, 2018

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్‌ ఆమ్రపాళి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కడియం, అనంతరం కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులను మంత్రి అవార్డులతో సత్కరించారు.

కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఈటెల.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వం తరుపున ప్రతిభ పురస్కారాలు అందించారు. రామగుండం సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గనులపై త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పాల్గొన్నారు.

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరుల కుటుంబాలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు అవార్డులను బహుకరించారు. మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో డీప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. వినాయక్‌ నగర్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్‌ జరిగిన వేడుకల్లో ఆబ్కారిశాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే సింగరేణి గనుల సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్‌ పవిత్రన్‌ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన వేడుకల్లో విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నల్లగొండలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వికారాబాద్‌ పోలీసు గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి, అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.

అలాగే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్ రంగనాథన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉస్మానియా యూనివర్శిటీలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వర్శిటీ వీసీ ఆర్ట్స్ కళాశాల భవనంపై జెండా ఆవిష్కరించారు. 

Don't Miss