ఆదిలాబాద్ లో రైతుల గోస

08:02 - September 7, 2017

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా 5.19 లక్షల మంది రైతులుంటే, ఇందులో 50 శాతం మంది రైతులకు మాత్రమే బ్యాంకు రుణాలు అందుతున్నాయి. అవి కూడా అరకొరగా అందుతుండటంతో పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇక బ్యాంకు గడప తొక్కని ఇతర రైతులు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

వర్షాధార పంటలపైనే ఆధారపడాలి
ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఏడు లక్షల హెక్టార్ల వ్యవసాయభూమి ఉంది. అయితే ఏటా సాగయ్యే భూమి ఆరు లక్షల హెక్టార్లకు మించడం లేదు. సాగు నీటి సౌకర్యం 2.50 లక్షల హెక్టార్లకే ఉండటంతో.. ఎక్కువ మంది రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో కాలువల ద్వారా 60 వేల హెక్టార్లు, రిజర్వాయర్ల ద్వారా 72 వేలు, బావులు, బోర్లు తదితర వాటితో 50 వేలు, ఇతర సౌకర్యాల ద్వారా 28 వేల హెక్టార్ల భూమికి సాగు నీరందుతోంది. జిల్లాలో ఉన్న సాగు భూమిలో 32 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. దీంతో కాలం కలిసి రాక రైతులు ఏటా నష్టపోవాల్సి వస్తోంది. దీంతో తిరిగి పంట వేయటానికి దళారుల వద్ద మళ్లీ అప్పులు చేస్తున్నారు. ఇలా ఏటా అప్పులు పెరుగుతున్నాయే తప్ప లాభపడింది లేదని రైతన్నలు వాపోతున్నారు. అయితే జిల్లాలో ఈ ఏడాది పంట రుణాలు రూ.1323 కోట్లు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గతంతో పోలిస్తే రెండేళ్లలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం పెరిగినా రైతులను ఆదుకోవడంలో బ్యాంకులు వెనుకబడి ఉన్నాయి. అప్పులు తీసుకునే వారిలో సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. పంటల సాగుకు పెట్టుబడి లేకపోవడంతో రైతులు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
అయితే జిల్లాలో అటవీ భూమిని హక్కుగా పొంది సాగు చేసుకుంటున్న రైతులు 50 వేలకు పైగా ఉన్నారు. వారికి ప్రభుత్వం భూమి సాగు చేసేందుకు హక్కు కల్పించినా ఆ భూమిపై పంట రుణం పొందని పరిస్థితి ఉంది. ఎన్నోఏళ్లుగా ఏజెన్సీ ఏరియాలో భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. వారికి ఆ భూములపై పట్టాలు లేకపోవడంతో ఆయా రైతులు రుణాలు పొందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తమకు రుణాలు బ్యాంకుల నుంచే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఏజెన్సీ ఏరియాలో భూములు సాగుచేసుకునే రైతులకు కూడా రుణాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

Don't Miss