ఎన్నాళ్లీ నగదు కష్టాలు...

19:35 - December 13, 2016

ఎన్నాళ్లీ నగదు కష్టాలు. ఎప్పుడు తీరేను ఈ నోట్ల పాట్లు. ఎక్కడ చూసినా... నగదు కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గంటలకొద్దీ క్యూలో ఉన్నా చివరికి ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. అసహనం కోల్పోతున్న ప్రజలు పలుచోట్ల బ్యాంకర్లపై తిరగబడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ గందరగోళం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. దేశ వ్యాప్తంగా ఇంకా ప్రజలు క్యూ లైన్లలో నిలబడి అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. 3 రోజుల విరామం తరువాత తెరుచుకున్న బ్యాంకుల ముందు ఉదయం నుంచే భారీ క్యూలు కనిపించాయి.

నెల్లూరులో..
నెల్లూరు నగరంలోని బార్కాస్‌ ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతాదారులకు బ్యాంకు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. మూడు రోజుల తర్వాత గంటల కొద్దీ క్యూలో నిల్చున్నా రెండు వేలు ఇవ్వడంతో ఖాతాదారులు సిబ్బందితో గొడవకు దిగారు. బడా బాబులకు కోట్లకు కోట్లు ముట్టజెప్పి సామాన్య ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారని మూకుమ్మడిగా తిరగబడ్డారు. విజయవాడలో ఏటీఎంల వద్ద గంటల కొద్ది నిలబడ్డా... నగదు దొరకని పరిస్థితి ఉంది. కనీసం పాల ప్యాకెట్లకు, టీ తాగడానికి కూడా చిల్లర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో..
రోజురోజుకు పెరుగుతున్న నగదు కష్టాలకు నిరసనగా హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకు ముందు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని నిబంధనలున్నా..బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్లలో నిలుచుకున్న ఖాతాదారులకు వాటర్‌ బాటిళ్లు అందజేసి తమ నిరసన తెలిపారు.

జగిత్యాల..
మూడు రోజుల సెలవుల అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో బ్యాంకుల ముందు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. గంటల కొద్ది లైన్లలో నిలుచున్నా తమ వద్దకు వచ్చే వరకు డబ్బులు అందడం లేదని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతపురం..
నోట్ల రద్దు ప్రకటించి 35 రోజులు గడిచినా.. సామాన్య ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రదాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని అనంతపురం స్టేట్‌ బ్యాంకు వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. సామాన్య ప్రజలు రోజుల తరబడి క్యూల్లో నిలుచుని నోట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సంపన్నులకు మాత్రం కోట్ల రూపాయల కట్టలు ఇంటికి వచ్చి చేరుతున్నాయని సీపీఎం విమర్శించింది. ప్రతి ఖాతాదారునికి రోజుకు 10 వేల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. నగదు కోసం వెళితే బ్యాంకర్లు ఖాతాదారులకు సహకరించడం లేదని ప్రధాని మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

కుదేలైన పరిశ్రమలు..
నగదు కష్టాలతో హైదరాబాద్ బాలానగర్‌లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కుదేలయ్యాయి. ఓ వైపు పెరిగిన ముడి సరుకులు కొనలేక, మరోవైపు కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగ్గిన వ్యాపారంతో ఆర్డర్స్‌ రాక.. ఒకవేళ వచ్చినా... నగదు అందుబాటులో లేక పోవటంతో ఆందోళన చెందుతున్నారు. నగదు కోసం బ్యాంకులో నిలబడితే ఇక్కడ పని దొరకదని.. ఆ రోజు పనిలేక పోవటంతో రోజు కు వచ్చే 3 ,4 వందలు కుడా నష్టపోతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ నర్సాపురంలో..
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో బ్యాంకులు తెరవక ముందే ప్రజలు నగదు కోసం క్యూలు కట్టారు. డిపాజిట్లు చేయడానికి, నగదు తీసుకోవడానికి వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయమే బ్యాంకుకు వచ్చి క్యూలో నిలబడ్డ వృద్ధులు..ఓపిక నశించి లైన్లలోనే కూర్చోని విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.

చిరు వ్యాపారుల కష్టాలు..
చిరు వ్యాపారుల కష్టాలయితే చెప్పనలవి కాకుండా పెరిగిపోతున్నాయి. రెండువేల రూపాయల నోటకు చిల్లర దొరక్క వ్యాపారాలు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏటీఎం, బ్యాంకుల ముందు క్యూలు కడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా.. నగదు కష్టాల నిట్టూర్పులే వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై.. సామాన్యులు భగ్గుమంటున్నారు. 

Don't Miss