క్యాష్ లెస్ కంట్రీ సాధ్యమేనా..!

20:42 - November 28, 2016

జేబులో కరెన్సీ అవసరం లేదు.. బీరువాలో కట్టలు దాచుకోవలసిన పనిలేదు.. చిన్న ప్లాస్టిక్ కార్డుంటే చాలు పనైపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ట్రాన్సాక్షన్ క్లియరౌతుంది. జేబులో బరువైన వాలెట్ కాస్తా... మోబైల్ వాలెట్ గా మారుతోంది. ఇంతకీ చెప్పేదేంటంటే.. కరెన్సీ నోట్లు మాయమై... డిజిటల్ ఎకానమీ దిశగా దేశాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోంది. మరిదీనికి సాధ్యాసాధ్యాలెన్ని.. అవరోధాలేంటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..సింగపూర్ లాంటి దేశానికి 30ఏళ్లు పట్టింది. మరి ఇప్పటికి 91వస్థానంలో ఉన్న మనదేశం డిజిటల్ ఎకానమీలో ఎప్పుడు దూసుకెళ్తుంది. ఇదే సమాధానం తెలియాల్సిన ప్రశ్న. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు అంతంత మాత్రంగా ఉన్నచోట.. ఎవరికోసం ఈ నిర్ణయం.. ఎవర్ని కష్టపెట్టి ఈ లక్ష్యం సాధిస్తారు.. చాలా సవాళ్లు... అస్పష్ట సమాధానాలు..నగదు రహిత భారతం ఎంత వరకు సాధ్యం .. ఎన్నాళ్లలో సాధ్యం..గ్రామీణ భారతం ఎన్నేళ్లకు ఈ అంశాన్ని అందుకోగలదు?బ్యాంకింగ్ రంగం విస్తరణలో ఇంకా ఎంతో సాధించాల్సిన సమయంలో ఈ లక్ష్యం ఎంతవరకు అందుకోగలం..? డిజిటల్ ఎకానమీ సృష్టిలో మన స్థానం ఎక్కడ? ఎన్నాళ్లకు లక్ష్యాన్ని సాధించగలం.. మహా మహా దేశాలకే చాలా కాలం పట్టింది.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్యాష్ లెస్ అయిన దేశాలు చాలా తక్కువ. మరి ఈ జాబితాలో మన ప్లేస్ ఎక్కడ? డిజిటల్ ఎకానమీ ఏర్పాటులో చాలా అడుగున ఉన్న మనం ఎన్నాళ్లకు క్యాష్ లెస్ కంట్రీగా మారగలం..? సర్కారు అంచనాల్లో సాధ్యాసాధ్యాలెంత? డెబిట్, క్రెడిట్ కార్డులు వచ్చి చాలా కాలమైనా వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్న వారి సంఖ్య తక్కువ. ప్లాస్టిక్ కరెన్సీకి అలవాటు కాకముందే మొబైల్ వాలెట్ లు వచ్చేశాయి. కానీ, మరో పక్క మన దేశం ఇంటర్నెట్ సౌకర్య కల్పనలో మాత్రం చాలా వెనుకబాటులో ఉంది. ఈ పరిస్థితుల్లో క్యాష్ లెస్ కంట్రీగా మారటానికి అవరోధాలు మరిన్ని కనిపిస్తున్నాయి. దేశ ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయాలుండాలి. గ్రామీణ ప్రజలు అధికంగా ఉన్నచోట, సాంకేతికంగా సవాళ్లు ఉన్నచోట క్యాష్ లెస్ గా మారటం అంత సులభ సాధ్యమేమీ కాదు. మరోపక్క ప్లాస్టిక్ కరెన్సీ మాత్రమే నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికడుతుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి.. నల్లధనం జనరేట్ అయ్యే మార్గాలను నియంత్రించకుండా.. కరెన్సీ నుంచి ఇతర రూపాల్లోకి మారిన నల్లధనాన్ని వెలికి తీయకుండా చేసే మార్పులు పూర్తి ఫలితాల్ని ఇస్తాయా అంటే సందేహమే.. 

Don't Miss