ఇన్పిరేషన్ విలేజ్ ముక్రేకే ..

12:33 - December 20, 2016

ఆదిలాబాద్ : మార్పు అనివార్యం. అది తెలిసినప్పుడు.. మార్పు దిశగా ప్రయాణం అవశ్యం. తద్వారా విజయమూ సాధ్యం. ఇదీ ఆదిలాబాద్‌ జిల్లా ముక్రాకే గ్రామస్థుల నవ్య నినాదం. ఇంతకీ ఏంటా మార్పు..? ఏదిశగా వారి పయనం.? వారు సాధించిన ఘన విజయం ఏంటి..? వాచ్‌ దిస్ స్టోరీ.

మార్పును స్వాగతించిన ఆదర్శ గ్రామం..
మార్పును స్వాగతించిన ఆదర్శ గ్రామం.. ప్రతి ఒక్కరిలో మూర్తీభవించిన చైతన్యం..చిన్నా పెద్దా కృషితో నగదు రహితమైన గ్రామం..విప్లవాత్మక మార్పులో మేము సైతం అంటూ ముందుకు సాగిన జనంఇదీ ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్థుల్లో వెల్లివిరిసన నవ చైతన్యం. నగదు కష్టాల నుంచి ఉపశమనానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమన్న ఏలికల అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఈ గ్రామస్థులు విప్లవాత్మక మార్పును స్వాగతించారు. అందరూ బాగుండాలి.. అందులోనూ మేము ముందుండాలి అన్న భావనతో ఈ గ్రామస్థులంతా నగదు రహిత లావాదేవీలపైపు మళ్లారు.

నగదు రహిత లావాదేవీల్లో దూసుకు పోతున్న ముక్రాకేవాసులు
పెద్ద నోట్ల రద్దు దరిమిలా.. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూ.. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా చేతిలో నగదు లేక సతమతమవుతున్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన కొత్తల్లో ముక్రాకే గ్రామస్థులూ ఇదే తరహా వేదనను అనుభవించారు. అదే తరుణంలో ప్రభుత్వ సూచనతో.. చిల్లర కష్టానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమని గట్టిగా నమ్మారు. ఆ దిశగా అడుగులు వేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం గ్రామాన్ని స్పూర్తిగా తీసుకుని.. ముక్రాకేని .. సంపూర్ణ నగదు రహిత లావాదేవీల గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు అక్కడి ప్రజలు.

ముక్రేకే గ్రామానిది ఒకే మాట ఒకే బాట..
నగదు రహిత లావాదేవీలపై సంపూర్ణ అవగాహన పెంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ముక్రాకేవాసులు. 650 మంది జనాభా గల ముక్రాకే ప్రజలది ముందునుంచీ ఒకేమాట ఒకేబాట. గ్రామంలో ఏ సమస్య వచ్చినా.. అంతా కలిసి చర్చించి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే వారు. ఇప్పుడు చిల్లరకు కష్టమొచ్చిన వెంటనే.. ప్రత్యామ్నాయ నగదు రహితంపై దృష్టి సారించారు. వీరికి స్వచ్చంద సంస్థ- సీఎస్‌సీ సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఈ సంస్థ ప్రతినిధులు నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించడమే కాకుండా.. వారం రోజుల పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ దీనిపై అవగాహన కల్పించారు. స్వైపింగ్ మిషన్ వాడకం, మొబైల్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు, పేటీఎం వాడకం వంటి నగదు రహిత లావాదేవీ విధానాలను నేర్పారు.

కంప్యూటర్‌ విద్యపై కూడా అవగాహన
మార్పును స్వాగతించడంలో ముక్రాకే ప్రజలు ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారు. గతంలో కూడా గ్రామస్థులంతా కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించి.. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్‌ విద్యపైనా గతంలోనే గ్రామస్థులందరూ అవగాహన పెంచుకున్నారు. దీంతో ముక్రాకే వందశాతం డిజిటల్‌ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి పెద్దగా శ్రమ అవసరం లేకుండాపోయింది.

160 కుటుంబాలు అండ్రాయిడ్‌ ఫోన్‌
గ్రామంలోని కిరాణ షాపులో కూడా మొబైల్‌ ద్వారా చెల్లింపులు చేసేలా నగదు రహిత లావాదేవిలపై చక్కగా అవగాహన పెంచుకున్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవిలు జరిపేలా గ్రామంలో ఉన్న 160 కుటుంబాలు అండ్రాయిడ్‌ ఫోన్‌ సదుపాయంతో లావాదేవిలు జరుపుతుండటం విశేషం.

వందశాతం నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న ముక్రాకే
నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు ముగింపు కార్యక్రామానికి హాజరైన స్థానిక ఎంపీ నగేశ్‌ సైతం గ్రామస్తుల ముందుచూపు, చైతన్యం, సామాజిక స్పృహను అభినందించారు. అంతటా నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ముక్రాకే గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి మార్పును స్వాగతించడం నిజంగా హర్షనీయం.

 

Don't Miss