పోలీసు కేసన్నదే ఎరుగని గ్రామం...

13:27 - August 24, 2017

నిజామాబాద్ : మనిషి.. మానవత్వాన్ని మరచి నేర ప్రవృత్తిని పెంచుకుంటున్న కాలమిది. రకరకాల నేరగాళ్లను నియంత్రించేందుకు.. నవీన వ్యవస్థలను రూపొందించుకుంటోన్న తరుణమిది. ఇలాంటి రోజుల్లోనూ.. ఓ గ్రామం అహింసా పరమో ధర్మః అంటూ ప్రవచిస్తోంది.. అదే ధర్మాన్ని అక్షరాలా పాటించి చూపుతోంది. ఫలితంగా.. మూడు దశాబ్దాలుగా పోలీసు కేసన్నదే ఎరుగని గ్రామంగా భాసిల్లుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది..? తెలుసుకోవాలనుకుంటున్నారా..? వాచ్‌ దిస్‌ స్టోరీ  
డికంపల్లి...ఆదర్శ గ్రామం 
ఈ ఊరందరిదీ ఒకే గొంతు...ఊరుమ్మడిగా నిర్దేశించుకున్న స్వీయ క్రమశిక్షణ....అహింస, అన్యాయం, అక్రమాలకు అందనంత దూరం.. ఆగ్రామం. నిజామాబాద్ జిల్లా మాక్లురు మండలంలోని డికంపల్లి.. ఐకమత్యంలో.. సాటి గ్రామాలకు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈర్ష్యాద్వేషాలకు ఈ గ్రామం వ్యతిరేకం. జగమంత కుటుంబం మనది అంటూ ఐక్యతారాగం పాడుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతిపనిలోనూ క్రమశిక్షణ పాటిస్తారు. ఫలితంగా.. ఈ గ్రామంలోని ప్రజలు... ముప్పై ఏళ్ల కాలంలో ఎన్నడూ పోలీసు స్టేషన్‌  ముఖం చూడాల్సిన అవసరం రాలేదు. 
గ్రామ జనాభా 2 వేలపై చిలుకు 
డికంపల్లి గ్రామ జనాభా 2 వేలపై చిలుకు మాత్రమే.. ఓటర్ల సంఖ్య 1600 మాత్రమే. 70 శాతం మంది వ్యవసాయంపై  ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలాల దగ్గరికి వెళ్తారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి 10 గంటల వరకు గ్రామానికి చేరుకుంటారు. ఇంటిపనులు ముగించుకుని.. సాయంత్రం కాగానే స్వాధ్యాయ కేంద్రానికి వెళతారు. ఇక్కడ తమలోని సేవాతత్పరతను, ఆధ్యాత్మిక చింతనను.. సామాజిక స్పృహను ఇక్కడే ఇనుమడింప చేసుకుంటారు. 
డికంపల్లిలో సర్వమత సామరస్యం 
డికంపల్లి గ్రామం సర్వమత సామరస్యాన్ని పాటిస్తోంది. అన్ని పండగలు శాంతియుతంగా ఐకమత్యంగా జరుపుకుంటారు. రెండు వేల మంది జీవిస్తున్న ఈ గ్రామంలో పరస్పర గొడవలు, చిన్నపాటి తగాదాలు ఉండకుండా ఉంటాయా..? కచ్చితంగా ఉంటాయి. అయితే.. ఎలాంటి గొడవలు జరిగినా ప్రజలంతా ఊరినడిబొడ్డున ఉన్న చెట్టు  వద్దే ఆ తగాదాలను పరిష్కరించుకుంటారు. ఎలాంటి సమస్యనైనా సమావేశంలోని తీర్మానాల ద్వారానే సర్దుబాటు చేస్తారు. 
ఠాణాలో ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాకపోవడం గమనార్హం 
డికంపల్లి మాక్లురు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 30 ఏళ్లుగా గ్రామం నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఠాణాలో నమోదు కాకపోవడం గమనార్హం. తాము అధికంగా విశ్వసించేది  భూతల్లినని..ప్రశాంతంగా ఉండేందుకు స్వాద్యాయ కేంద్రానికి వెళ్లడం వల్ల కోపతాపాలకు తావుండని స్థానికులు అంటున్నారు. మనిషి తలుచుకుంటే అసాధ్యమనేది లేదు. ఐక్యంగా ముందడుగు వేయాలి.  కలిసి కదిలితే ఏదైనా సాధ్యమే అని డికంపల్లి గ్రామం ఇస్తున్న సందేశమిదే. 

 

Don't Miss