డబుల్ బెడ్ రూం ఎక్కడ..?

19:58 - March 3, 2017

మహబూబ్‌ నగర్‌/నిజామాబాద్‌ : మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లా ఏదైనా పరిస్థితి ఒక్కటే. మహబూబ్‌ నగర్‌ ఒకప్పుడు కెసిఆర్‌ ప్రాతినిథ్యం వహించిన జిల్లా. నిజామాబాద్‌ ఆయన కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. కానీ ఏం లాభం? మహబూబ్‌ నగర్‌ లో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్‌ శంఖుఃస్థాపన చేసినా, నిజామాబాద్‌  ఏడాది కవిత శంఖుఃస్థాపన చేసినా అవే మాటలు. అవే కథలు. అవే వ్యధలు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తున్నామంటూ, వున్న ఇళ్లను కూల్చేశారు. వున్న ఇల్లు కూల్చుకుని రేకుల షెడ్డుల్లో తలదాచుకుంటున్నారు లబ్ధిదారులు. మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో డబుల్‌ బెడ్‌ రూంలపై క్షేత్ర స్థాయి వాస్తవాలే ఇవాళ్టి స్పెషల్‌ ఫోకస్‌. 
మహబూబ్ నగర్ లో
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పరిస్థితి. మహబూబ్ నగర్ పట్టణంలో కొన్ని ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి.
లక్షల్లో దరఖాస్తులు
మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య లక్షకు పైగా వుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు కలిపి 5600 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. స్టేట్ రిజర్వ్ కోటా కింద నాగర్ కర్నూలుకు మరో 400 ఇళ్లు మంజూరయ్యాయి. 
3560 ఇళ్లకు పరిపాలనా అనుమతులు 
జిల్లాల విభజన అనంతరం రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలో కలిసింది. ఈ జిల్లాకు 4440 ఇళ్లు మంజూరవ్వగా, 3560 ఇళ్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. అంతే. అంతకుమించి మరేమీ జరగలేదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తప్ప మరెక్కడా ఇళ్ల నిర్మాణం మొదలవ్వలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల మీద ఆశలు పెట్టుకున్నవారిలో అసహనం పెరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. 
ఇసుక సమస్య 
జిల్లాలో ఇసుక సమస్య తీవ్రంగా వుండడంతో కాంట్రాక్టర్లెవ్వరూ ముందుకు రావడం లేదు. మహబూబ్ నగర్ పట్టణంలో కొన్ని ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన్నప్పటికీ అవి పూర్తికాలేదు. మార్చి నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. దీంతో డబుల్ బెడ్ రూం దరఖాస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం బృందం ముందు తమగోడు వెళ్లబోసుకున్నారు. 
డబుల్‌ బెడ్‌రూం కట్టేదెప్పుడు?
నాలుగు నెలల్లో దావత్ చేసుకుందాం. ఎక్కడికెళ్లినా ఇదే మాట చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ మురికివాడలవాసులకూ ఇదే మాట చెప్పారు. నాలుగు నెలలు కాదు 26 నెలలైంది. కానీ దావత్ జరగలేదు. ఆయన శంకుస్థాపన చేసిన  డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇన్నాళ్లయినా పూర్తికాలేదు. 
శిథిలమవుతున్న శిలాఫలకం
26 నెలల క్రితం 2015 జనవరి 8న ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ మురికివాడల్లో పర్యటించారు. మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటూ కాలనీలలో కొబ్బరికాయలు కొట్టి, శంఖుస్థాపనలు చేశారు.  ఐదు నెలల్లో ఇళ్ల నిర్మాణ పూర్తి చేసి, దావత్ చేసుకుందామంటూ అందరికీ చెప్పినట్టే మహబూబ్ నగర్ వాసులకు కూడా కెసిఆర్ ఎక్కడలేని ఆశలు పెట్టారు. 
26 నెలలైంది..
నాలుగు నెలలు కాదు 26 నెలలైంది. నాలుగు నెలల్లోనే దావత్ అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్లీ మహబూబ్ నగర్ మురికివాడల వైపు కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తున్నామంటూ చెప్పిన మాటలు నమ్మి వున్న ఇళ్లను కూలగొట్టుకున్నవారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. అప్పులు చేసి రేకుల షెడ్డులు వేసుకోవాల్సి వచ్చింది. కెసిఆర్ చెప్పనట్టు నాలుగు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. వున్న ఇల్లు లేకుండా పోయింది. తలదాచుకోవడానికి అప్పు చేయాల్సి వచ్చింది.
రేకుల షెడ్డుల్లోనే కాలం వెళ్లదీత
తాత్కాలికంగా వేసుకున్న రేకుల షెడ్డుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు  రేకులు ఎగిరిపోయాయి. మొన్నటి చలిగాలులకు రేకుల షెడ్డుల్లో గజగజ వణికిపోయారు. మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే కాలంలో ఈ రేకుల షెడ్డులలో ఎలా బతకాలంటూ ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు నమ్మి, ఉన్న ఇళ్లను కూల్చుకున్నవారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకెంతకాలం ఈ కష్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తమగోడు వెళ్లబోసుకుంటూ అనేక మంది దరఖాస్తులు అందజేశారు.
శిలాఫలకానికి ఏడాది పూర్తి
మంత్రి జూపల్లి కృష్ణారావు ఏడాది క్రితం తలకొండకోపల్లి మండలం చెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శిలాఫలం వేశారు. ఇప్పుడది శిథిలమవుతోంది. ఇళ్ల నిర్మాణం మాత్రం మొదలుకాలేదు. దీంతో విసిగిపోయిన జనం శిలాఫలకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన మంత్రి శంకుస్థాపన చేసిన చోటనే పరిస్థితి ఇలా వుంటే, ఇక మిగిలిన చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యెదెన్నడు? దావత్ లు చేసుకునేదెప్పుడు? 
నిజామాబాద్ జిల్లాలో...
ఎంపి కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలోనూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఏ మాత్రం పురోగతి లేదు. 82 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి 1300 మంది అర్హులను మాత్రమే గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక కవిత శంఖు:స్థాపన చేసిన చోట ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు.
82000 దరఖాస్తులు
అది 2015 అక్టోబర్ 22. అదే రోజు ఎంపి కవిత, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి శంఖు:స్థాపన చేశారు. అవి ఇప్పటికీ పూర్తికాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దాదాపు 82వేల దరఖాస్తులొచ్చాయి. అయితే, మంజూరైనవి ఇందులో పదో వంతు కూడా లేవు. నిజామాబాద్ జిల్లాకు 4990 ఇళ్లు, కామారెడ్డి జిల్లాకు 2675 ఇళ్లు మంజూరైనట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం 120 గ్రామాల్లో 7665 ఇళ్లను మంజూరు చేశారు. కానీ, లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. ఇప్పటి దాకా పరిశీలించిన దరఖాస్తుల్లో కేవలం 1305 మంది అర్హులనే మాత్రమే గుర్తించినట్టు తెలుస్తోంది.
కొలిక్కిరాని టెండర్ల ప్రక్రియ 
మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం టెండర్ల ప్రక్రియ కొలిక్కిరావడం లేదు. రోడ్లు భవనాల అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు దొరకడం లేదు. ఇంతకు ముందు నిర్మాణ పనులు చేసిన అనుభవం లేని ముంబైకి చెందిన ఓ సంస్థ టెండర్లు దాఖలు చేయగా, తొలుత అధికారులు ఆ సంస్థను ఫైనల్ చేద్దామనుకున్నారు. ఒప్పందం కోసం రావాలంటూ ఆ సంస్థకు లేఖ కూడా రాశారు. నిబంధనలు పక్కాగా అమలు చేయాలంటూ ఉన్నతస్థాయి అధికారులు ఆదేశించడంతో ముంబై సంస్థను ఫైనల్ చేయలేదు. జిల్లాలో పరిస్థితిని వివరిస్తూ జిల్లా కలెక్టర్ యోగితారాణా అధికారులకు నివేదిక పంపినట్టు తెలుస్తోంది.  కోటగిరి మండలం దొమలెడ్డి గ్రామంలో 40 డబుల్ బెడ్ రూంలు నిర్మిస్తుండగా, మరెక్కడా పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలో క్షేత్రస్థాయి వాస్తవాలు చూస్తుంటే ఇప్పట్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రజా ఉద్యమం నిర్వహించేందుకు సిపిఎం వ్యూహరచన చేస్తోంది. 
ఇచ్చిన మాట నిలుపుకోన్నప్పుడు ప్రజాగ్రహం 
ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలుపుకోన్నప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఉద్యమాలు ఉదయిస్తాయి. పోరాటాలు పదునెక్కుతాయి. అధికార పార్టీలు మాట నిలుపుకోకపోతే, ప్రజలు పోరాడే శక్తుల వెంట సమీకృతులవుతారు. ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్‌ కి తెలియంది కాదు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌ రూంల కోసం  ప్రజలు నినదిస్తున్నారు. . మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం బృందానికి వెల్లువెత్తిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం.  

 

Don't Miss