గేట్లెత్తేశారు..తలుపులు బార్లా తెరిచారు..

20:21 - January 11, 2018

గేట్లెత్తేశారు..తలుపులు బార్లా తెరిచారు..రావటానికి పోవటానికి ఎలాంటి అడకడంకులు లేకుండా చేసేశారు. దీని ఫలితం ఎలా ఉండబోతోంది? రిటెయిల్ రంగంపై ఇది చావుదెబ్బ కొట్టుందా? మన ఎయిర్ ఇండియాపై విదేశీ శక్తులు పట్టు బిగిస్తాయా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది ? ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక కథనం… ఓడమల్లన్న బోడిమల్లన్న సామెతను అక్షరాలా పాటిస్తున్నారు..విపక్షంలో ఉన్నంతకాలం వ్యతిరేకిస్తున్నాం.. అంటూ కబుర్లు చెప్పి..ఇప్పుడు ఏకంగా అన్ని అడ్డంకులు తొలగించేస్తున్నారు. బడాకంపెనీల సేవల మత్తులో, పెద్దన్న పూజలో పడి.. మన వ్యాపారుల బతుకులను, వారి ఉపాధిని ప్రశ్నార్ధకం చేస్తున్నారు. రిటెయిల్ రంగంపై మోడీ క్యాబినెట్ నిర్ణయం తీవ్రప్రభావం చూపనుందా? చిల్లర వ్యాపారులు, వర్తకుల ఉపాధిపై దెబ్బకొట్టే ప్రమాదం పొంచి ఉందా? బడాకంపెనీలు విచ్చలవిడిగా విస్తరించనున్నాయా? స్థానిక వ్యాపారుల పొట్ట కొట్టే నిర్ణయాలు మోడీ సర్కారు తీసుకుంటోందా?

మాటలకు స్వదేశీ.. చేతలకు విదేశీ..నోరుతెరిస్తే దేశభక్తి వరదలా ప్రవహిస్తుంది.. కానీ, నిర్ణయాల్లో మాత్రం విదేశీ భక్తి అడుగడుగునా స్పష్టమౌతుంది. కాకులను కొట్టి గద్దలకు వేసే ఈ నిర్ణయాలు ఎవరికోసం? ఎవరి ప్రయోజనాల కోసం..? మన వ్యాపారాలను, మన ఉపాధిని ప్రశ్నార్ధకం చేసే తప్పుడు నిర్ణయాలు ఎందుకోసం?

మన ఇంటి తాళాలు ఊరు పేరు తెలియని వారికివ్వటానికి, నూరుశాతం ఎఫ్డీలకు అనుమతింటానికి పెద్ద తేడా ఏం లేదు. నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తావిస్తే జరిగే పరిణామాలు అత్యంత ప్రమాదకరం.. దేశాన్ని నడిరోడ్డున నిలబెట్టి.. ఎవడిదారిన వాడు రావచ్చు పోవచ్చు అంటే నష్టం ఎవరికి? ఇది దేశ సుస్థిరతను, ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తుందనటంలో సందేహం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss