అన్నదాతల ఆత్మహత్యలు ఆగవా...

11:00 - May 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 1720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా గుర్తించిన లెక్క. పైగా ఆత్మహత్య చేసుకున్న వారిలో 680 కుటుంబాలకు తాము పరిహారం అందించామన్నది సర్కారు మాట. నిజానికి ఈ సంఖ్య దాదాపుగా రెట్టింపులోనే ఉందన్నది ప్రజాసంఘాల వాదన. ఈ మూడేళ్లలో 2600 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘాలు పేర్లతో సహా ప్రకటిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం.. 13 రకాల పత్రాలు సమర్పిస్తే.. అవన్నీ అనుమానరహితంగా ఉంటే.. అప్పుడు మాత్రమే, ఆత్మహత్యగా గుర్తిస్తామంటోంది. అన్ని రకాల పత్రాలను సమర్పించినా మళ్లీ త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో కాళ్లరిగేలా తిప్పుతున్నారు.

అధిక వడ్డీలు.....
రైతన్నల ఆత్మహత్యలకు ఆర్థిక పరమైన కారణాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం భారత దేశంలో మాత్రమే వ్యవసాయం చేసేందుకు ఎక్కువగా ప్రయివేటు అప్పులపై ఆధారపడుతున్నారు రైతులు. బ్యాంకులు ఇచ్చే రుణం ఏమూలకు సరిపోక పోవడంతో రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు రుణాలపై నియంత్రణ సరిగ్గా లేక పోవడంతో అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రతి పంటసీజన్‌ ప్రారంభంలో టార్గెట్లు నిర్ణయించుకుంటాయి. దీనికోసం ప్రతిఏడాది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై రైతు రుణాల మంజూరుపై చర్చలు జరుపుతుంది. కాని.. ఆచరణలో బ్యాంకుల పనితీరు రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ వద్ద ఉన్న నిల్వల్లో 18 శాతాన్ని రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కాని ఏఒక్క బ్యాంకు కూడా నిబంధనలను పాటించడంలేదు. దేశంలోని బ్యాంకుల్లో ఉన్న మొత్తం 86లక్షల కోట్ల రూపాయల నిల్వల్లో .. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం రైతులకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలి. కాని గతఏడాది ఇచ్చింది కేవలం 6.20 లక్షల కోట్లు మాత్రమే. పంట సాగు చేయడానికి సరిపడా ధనం అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు రుణాలపై ఆధార పడి.. చెల్లింపుల్లో కనీసం వడ్డీ కూడా కట్టలేక.. ఒత్తిళ్లు పెరిగి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కరువు పరిస్థితులు.....
మరోవైపు వరుసగా తలెత్తున్న కరువు పరిస్థితులు కూడా అన్నదాతలను కుంగదీస్తున్నాయి. కరవు వల్ల గత మూడెళ్లలోఒక్క తెలంగాణలోనే దాదాపు 18వేల కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లింది. అయితే కరవు సాయంగా కేంద్రాన్ని రాష్ట్రం అడిగింది కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలే. అటు కేంద్రంకూడా ఇవ్వలేదు అనకుండా.. కేవలం 790 కోట్ల రూపాయలు విదిల్చి బాధ్యతను దులపరించుకుంది. మరోవైపు 14 ఆర్థికసంఘం నిధులు, ఈ కరువు సాయం అంతా కలిపి 1300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. అయినా .. తమది రైతు ప్రభుత్వం అని తెగ ప్రచారం చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇంతవరకు కరువు సాయాన్ని పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతన్నల ఆత్మహత్యలను నివారించడానికి చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదుగో రైతులకు సాయం.. ఇదిగో వందలకోట్లు అనే పొల్లుమాటలు మాని.. సకాలంలో బ్యాంకురుణాలు అందేలా చూసి అన్నదాతను అప్పుల పాలు కాకుండా చూడాలని రైతుసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతిచోట దగపదుతున్న రైతన్న....
పకృతి బాధలకు తట్టుకుని పంటరాసులను బస్తాలకు నింపిన కర్షకులు .. వ్యాపారులు, దళారుల చేతిలో మాత్రం దారుణంగా మోసపోతున్నారు. దాంతోపాటు నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అన్ని కష్టనష్టాలకు ఓర్చి మార్కెట్‌కు వెళితే .. అరకొర ధరలు వెక్కిరిస్తున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతన్నలు అప్పుల పాలవుతున్నారు. పెట్టుబడికి తగిన విధంగా పంట దిగుబడి రాకపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగుల మందులు గోరుచుట్టుపై రోకటి పోటులా తయారయ్యాయి.

గిట్టుబాటు ధర.....
అష్టకష్టాలు పడి పంట పండించి మార్కెట్‌ కు తీసుకువెళితే గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు నష్టపోతున్నారు. దీనికి తోడు వరుసగా రెండున్నరేళ్లు రాష్ట్రంలో కరవు విలయతాండవం చేయడంతో పంటలు సరిగ్గా పండలేదు. అప్పులు మాత్రం కొండల్లా పేరుకుపోయాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక బలవన్మరణానికి పాల్పడుతున్నాడు రైతన్న. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 85 శాతం మంది రైతులు వరి, మొక్క జొన్న , పత్తి, మిరప, కంది పంటలే వేస్తున్నారు. విత్తనం వేసినప్పుడు ఉన్న ధర పంట చేతికి వచ్చాక ఉండటం లేదు. ఇక మద్దతు ధరల విషయంలో కేంద్రపాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. మార్కెట్లో పంట కుప్పలుగా పేరుకు పోయేవరకు.. మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో.. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారుతోంది.

ఇప్పటికీ అశాస్త్రీయ పద్దతి.....
అసలు పంటలకు మద్దతు ధర నిర్ణయించడంలో ఇప్పటికీ అశాస్త్రీయ పద్దతే కొనసాగుతుంది. సాగుకు అవుతున్న ఖర్చు, వస్తున్న ఆదాయంలో వ్యత్యాసం భారీగా ఉంటోంది. దేశప్రజలకు అన్నంపెడుతున్న రైతుల ఆదాయం , ఇతర రంగాల ఆదాయంతో పోలిస్తే.. నక్కకు నాగలోకానికి అన్నంతగా వ్యత్యాసం ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం 150 రెట్లు, టీచర్ల ఆదాయం 250 రెట్లు పెరగ్గా.. రైతుల ఆదాయం 40ఏళ్లలో పెరిగింది 20 రెట్లు మాత్రమే. మరో విషయం ఏంటంటే.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఆదాయం ఏకంగా 3వేల రెట్లు పెరగ్గా.. వ్యవసాయం చేస్తున్న కర్షకుల సంపాదన మాత్రం పాతాళంలోనే తచ్చాడుతోంది. రైతుల ఆత్మహత్యలను ఆపాలంటే వడ్డీ లేని రుణాలు, ప్రకృతి వైపరిత్యాల సందర్భంగా పంట నష్టపోతే పరిహారం అందించాలని, గిట్టుబాటు ధర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

నోరుమెదపని ప్రభుత్వం....
అనుక్షణం రైతుజపం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. వందలాది రైతుల ఆత్మహత్యలపై నోరుమెదపడంలేదు. వచ్చేఏడా నుంచి చేయబోయే సాయం గురించి ఊదరగొడుతున్న సర్కార్‌ .. గత ఏడాది ప్రకటించిన కరువుసాయంపై మాత్రం సైలెంట్‌గా ఉంటోంది. దీంతో రైతులబాధల పట్ల టీఆర్‌ఎస్‌ పాలకులది మొసలి కన్నీరేననేది తేటతెల్లం అవుతోందని రైతుసంఘాలు అంటున్నాయి. ఇప్పటికైనా రైతు ఆత్మహత్యల పట్ల తక్షణమే స్పందించి కుంగిపోయిన అన్నదాతలకు చిత్తశుద్ధితో చేయూత నివ్వాల్సి అవసరం ఉంది.

 

Don't Miss