` కాలాన్ని జయిస్తూ నేను`అంటున్న 'జ్వలిత'

20:19 - May 30, 2016

నేను ఆకాశం నీవు భూమి

నేను లేని నీవు అసంపూర్ణం

నాలో జ్వలిస్తున్న జ్వాలకు

వారసత్వం కోసం అన్వేషణ నాప్రేమ

ప్రేమించడం ప్రేమింపబడటం మిథ్య

అన్ని అనుబంధాలు అబద్దాలు,అవి అవసరాలు...

అంటూ స్త్రీపురుషుల సంబంధాలలోని డొల్లతనాన్ని కవిత్వంలో ఎండగట్టిన ప్రగతిశీల భావాల కవయిత్రి జ్వలిత.సమాజంలోని ప్రతి సంఘటనకు స్పందిస్తూ కవిత్వమై జ్వలించే కవన జ్వాల ఆమె.వస్తువైవిధ్యం శిల్పశోయగంతో ఆమె` కాలాన్ని జయిస్తూ నేను` అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు.ఇందులో 51 కవితలున్నాయి. సబ్బన్న జాతులఆడది,కార్పొరేట్ దాంపత్యం,వడిసెల రాళ్లు,మరణంలో జీవించు, ఆమె ఆకాశం,గాజుల హేళన,మనోరాగం,కాలాన్ని జయిస్తూ నేను మెుదలైన కవితలు భావస్ఫోరకంగాఉంటూ మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

కాలాన్ని జయిస్తూ నేను

ఒక ఉనికిలా విస్తరించాల్సిన నేను

నేను లేని తనం శూన్యమయిన నేను

ఒక సామాజిక సజీవ సమాధిని

నా చుట్టూ నావాళ్లు నా మనుషులు నాకుగోడలు

ఖాళీ గ్లాసులా,ఖాళీ కుర్చీలా నేను

అంటూ అందరూ ఉన్నా మనిషి ఎలా ఒంటరిజీవితంలో ఒక శూన్య పాత్రికలా మిగిలిపోతారో అద్భుతంగా కవిత్వీకరించారు.అంతేకాదు బొన్సాయి మెుక్కను చేయబడిన నేను...వటవృక్షంలా ఊడలతో శాఖలతో విజృంభించాలి అంటూ ఆశావహదృక్పథాన్ని తన కవిత్వంలో అంతర్లీనంగా ధ్వనింపజేస్తారు కవయిత్రి.స్త్రీలకు జరిగిన అన్యాయాలను తలచుకుంటే జ్వలితలో ఒక హహోగ్రకవితావిరాట్ స్వరూపం దర్శనమిస్తుంది.తరతరాల దోపిడీకి గురయిన స్త్రీలు భార్యపాత్రల్లో ఎలా బలిపశువులుగా మిగిలి పోతున్నారో అందమైన అబద్దం కవితలో అద్బుతంగా విష్కరించారు..

 

పతి అన్నా అర్థాంగి అన్నా

సహవాసి అన్నా సహచరి అన్నా

ఏదయినా దోపిడీకి అణచివేతకు

కొలమానం భార్య

అంటూ స్త్రీలోకానికి కనువిప్పు కలిగిస్తారు.అంతేకాదు మానవ మృగాలదాడుల్లో అన్యాయానికి గురయిన అబలలకు చట్టాలు శాసనాలు నేతి బీరకాయలో నెయ్యిలా న్యాయం చేస్తాయని ఘాటుగా స్పందిస్తారు.ఆమె కలంతో గాక హృదయంతో కవిత్వం రాసినట్టనిపిస్తుంది..కొన్ని కవితల్లో భావావేశం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. భాషలో ఆమె హృదయఘోష వినిపిస్తుంది.జ్వలిత కేవలం కవిత్వమే కాదు ఆమె ఎన్నో కథలు రాశరు.వాటిని ఆత్మాన్వేషణ అన్న పేరుతో కథా సంపుటిగా వెలువరించారు.ఇందులో 12 కథలున్నాయి.ఆత్మాన్వేషణ,పడిగాపుల పండుగ,మాయమవుతున్న మనసు,సిబ్బి,మానవ సరోవరం,రాజుగారు కప్పల చెరువు,నాన్నా వాడెవ్వడు,సహస్ర ధార,మెుదలైన కథలు సరికొత్త కథనశైలిలో సాగిపోతాయి ,పాత్రచిత్రణ ,వాతావరణ కల్పన,కథను ఆసక్తిగా నడిపించే శైలీ విన్యాసం జ్వలిత కథల్లో కనిపిస్తాయి.ఇక ఆమె జీవిత విశేషాల్లోకి వెళితే ఆమె 1959 లో ఈశ్వరమ్మ రాఘవయ్య దంపతులకు ఖమ్మం జిల్లా తిరుమలాయపాళెంలో జన్మించారు.నాలుగు పోస్టుగ్రడ్యుయేట్ డిగ్రీలు సంపాదించుకున్నారు.ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.ఆమె ఎన్నో కవితలు కథలు వ్యాసాలు రాశారు.కాలాన్ని జయిస్తూ నేను,సుదీర్ఘ హత్య,ఆత్మాన్వేషణ,మర్డర్ ప్రొలాంగేర్,అగ్నిలిపి, మెుదలైన రచనలు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఖమ్మజిల్లా కథల పేరుతో తనే సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూ 672 పేజీల ఒక బృహత్ గ్రంథాన్ని వెలురించారు.రుంజ,గాయాలే గేయాలై పరివ్యాప్త,మెుదలైన కథా కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.జీవన జ్వలిత చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి సమాజసేవ చేస్తున్నారు.ఆమె సాహితీ సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.రంజని నందివాడ శ్యామల స్మారక పురస్కారం,భూమిక ఉత్తమకథా పురస్కారం, మధర్ థెర్రిస్సా సేవాసంస్థ ఆణిముత్యం పురస్కారం,రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం ,శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం,విశ్వభారతి ఉగాది పురస్కారం..ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.జ్వలిత కేవలం రచయిత్రిగానే కాకుండా అఖిల భారత రచయిత్రుల కమిటీలో మెంబర్ గా ఉంటూ క్రియాశీలక పాత్రపోషిస్తున్నారు.వివిధ రచయితల,ప్రజాసంఘాలలో నాయకురాలిగా ఉంటూ దళిత బహుజన సాహిత్యప్రచారానికి విశేష కృషి చేస్తున్నారు.జ్వలిత అన్నది కలంపేరు. అసలు పేరు విజయ కుమారి దెంచనాల.అయితే కవయిత్రిగా ,కథన శిల్పిగా ఆమె జ్వలిత పేరుతోనే సాహితీ లోకంలో తనదైన ముద్రను వేసింది.ఆమె కలం నుండి భవిష్యత్తులో మరెన్నో రచనలు వెలువడాలని ఆశిద్దాం.

Don't Miss