మహారాష్ట్రలో కొనసాగుతున్న మృత్యుఘోష

12:10 - October 12, 2017

 

నాగపూర్ : మహారాష్ట్రలో రైతుల మృత్యుఘోష. నెల్లాళ్ల వ్యవధిలో 50 మంది రైతుల మృతి. చూపు కోల్పోయిన 300 మంది రైతులు. పిచ్చివాళ్లవుతోన్న యావత్మాల్‌ రైతాంగం ఎందుకీ దుస్థితి..?దేశంలో దాదాపు 6 కోట్ల కుటుంబాల జీవితాలు.. పత్తితో ముడిపడి ఉన్నాయి. 60 లక్షల మంది నేరుగా పత్తి పండిస్తుంటే.. 5 కోట్ల మందికి పైగా టెక్స్‌టైల్‌ సంబంధ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వరి తరువాత ఎక్కువ మంది సాగు చేస్తోన్న పంట పత్తి మాత్రమే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పత్తి ఎక్కువగా సాగవుతోంది. ఈ రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ విదర్భలో జరుగుతున్నవి రైతుల ఆత్మహత్యలు కావు. కానీ రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వ్యాపారుల లాభాపేక్ష..
మహారాష్ట్రలోని విదర్భలో.. రైతులు పురుగుమందుల వ్యాపారుల లాభాపేక్ష.. వంచనలకు గురై అసువులు బాస్తున్నారు. పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఇప్పటివరకూ 20 మంది రైతులు చనిపోయారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. రాష్ట్ర రాజధాని ముంబయికి 670 కిలోమీటర్ల దూరం ఉన్న యావత్మాల్‌ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడంతో నెల రోజుల్లో 20 మంది చనిపోయారు. ఇప్పటివరకూ మొత్తం 800 మంది రైతులు పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

పిజ్‌గావ్‌ గ్రామాన్ని సందర్శించిన 10టీవీ
యావత్మాల్‌ జిల్లా, మారేగావ్‌ తాలుకా పిజ్‌గావ్‌ గ్రామాన్ని 10టీవీ సందర్శించింది. ఇక్కడ పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేయడంతో.. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. శంకర్‌ నాగోజి అగ్లావే అనే రైతు నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి ఇద్దరు కుమారులున్నారు. అతని నాలుగెకరాల పొలంలో పత్తి, సోయా వేశాడు. పోలో సింటెంజా అనే పెస్టిసైడ్‌ని పిచికారీ చేయడంతో అదే రోజు సాయంత్రం సొమ్మసిల్లిపడిపోయాడు. అతని కుటుంబ సభ్యులు 4 రోజులు ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం దక్కలేదు. అతని భార్యాపిల్లలు ఇప్పుడు దిక్కు లేకుండాపోయారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతోంది. అశోక్‌ గెడెం అనే వ్యక్తి పత్తి చేనుకు పురుగుల మందు స్ప్రే చేయడానికి పనికి వెళ్లిన పాపానికి కంటి చూపును కోల్పోయాడు. అంధకారంలో మగ్గిపోతున్నాడు. రాథోడ్ అనే రైతు తన కుటుంబాన్ని పోషించే దిక్కు లేక.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బ్రహ్మానంద్‌ ఆదిక్‌ అనే వ్యక్తి కూడా చూపు కోల్పోయాడు.

ప్రాణాలు తీస్తున్న పోలో సిజెంటా
పోలో సిజెంటా అనే మందును గతంలో ఇచ్చిన దానికన్నా తక్కువ ఇచ్చి తమతో వాడించారని రైతులు అంటున్నారు. ఆ పెస్టిసైడ్‌ స్ప్రే చేసిన వారంతా అస్వస్థతకు గురయ్యారని, తమ గ్రామంలో అయిదుగురు చనిపోగా.. ఇంకొందరు కంటి చూపు కోల్పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వానికి సరైన నివేదికను పంపడంలో.. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సమస్యకు పరిష్కారం అన్వేషించక పోగా.. రైతులు పిట్టల్లా రాలుతున్నా.. పట్టనట్లే వ్యవహరించింది. మీడియా ద్వారా విషయం తెలియడంతో.. సీఎం ఫడ్నవీస్‌ స్పందించి.. యావత్మాల్‌ రైతుల మరణాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటికి గానీ అసలు విషయం ఆయన దృష్టికి చేరలేదు. దీంతో.. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం ఫడ్నవిస్‌ హామీ ఇచ్చారు. కిందిస్థాయి అధికారుల ఉదాసీనత ఫలితంగా.. 50 మంది దాకా రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 

Don't Miss