వన దేవతకు జన జాతర

11:50 - January 30, 2018

భూపాలపల్లి : ఎక్కడో మారుమూలన ఏటూరు నాగారం అడవుల్లోని మేడారం. గిరిజనానికే కాదు.. నాగరిక సమాజానికీ ఇది పవిత్ర క్షేత్రం..సమ్మక్క-సారలమ్మల పేరిట ప్రకృతితో మమేకమయ్యే అద్భుత ఘట్టం..అవును.. గిరిజన మహాకుంభమేళగా పిలుచుకునే ఆసియా అతిపెద్ద జాతరకు ఆతిథ్యమిచ్చే మేడారమంటే గిరిజన తెగలకు ప్రాణం. మేడారం గాలి సోకితే చాలు జీవితం ధన్యమవుతుందనుకుంటారు. ఇదే సమ్మక్క సారలమ్మల జాతరకున్న గొప్పతనం.ఎర్రబడ్డ ఆకాశం.. ఆకుపచ్చదనాన్ని పులుముకుని.. స్వచ్చంగా.. నిర్మలంగా ఉండే మేడారం.. ఎర్రని ధూళిని అద్దుకుని.. సింధూరవర్ణ కాంతులను ఈనుతుంటుంది. మేడారం.. గాలి కూడా చొరబడదేమో అన్న రీతిలో జన సందోహంతో కిక్కిరిపోతోంది. చిన్నా..పెద్దా...ముసలి..ముతక.. ఒక్కరేమిటి తారతమ్యాలు మరిచిపోయి... బాహ్య ప్రపంచానికి దూరంగా.... తమను తాము త్యజించి .. అద్భుత పారవశ్యానికి గురయ్యే మనోహర ఘట్టం అక్కడ ఆవిష్కారమవుతుంది. రెండేళ్లకో సంబరం.. పదేళ్లకు సరిపడా ఆనందం ఈ మేడారం జాతర గొప్పతనం. కాకతీయుల కళాతృష్ణ ...చారిత్రక వరంగల్‌ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో ఏటూరు నాగారం అడవుల్లో ఉంది ఈ మేడారం. గ్రామంలో రెండు గద్దెలను దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. రెండెళ్లకోసారి జరిగే.. జాతర మహాకుంభమేళాను తలపిస్తుంది. 13వ శతాబ్దంలో కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడికి ఎదురొడ్డి నిలిచిన వీరవనితలు సమ్మక్క సారక్కలు. ఆ మగువల తెగువను మనసారా.. తలుచుకోవడానికి.. ఆ తల్లుల త్యాగనిరతికి ప్రణామాలు చేయడానికే ఈ జాతర.. ప్రతి రెండేళ్ల కోసారి పెద్ద ఎత్తున.. నిర్వహిస్తుంటారు.. ఈ సందర్భంగా.. ప్రజలు ఆ తల్లుల్లకు నీరాజనాలు అర్పిస్తారు.

 

శత్రువుపై కత్తిదూసిన వీరవనితలు...
సమ్మక్క, సారలమ్మలు పురాణ దేవతలు కాదు. తమ జాతి కోసం, తమవారి కోసం శత్రువుపై కత్తిదూసిన వీరవనితలు. ప్రత్యర్థితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అడవి ఆడపడుచుల యదార్థ గాధ ఇది. తమతో మెలిగి, తమతో కలిసి, తమవారికోసం ప్రాణాలు విడిచిన విషాద గాధ ఇది. అది 11వ శతాబ్దం. కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి ప్రతాపరుద్రుడి కాలం. ఈ కాలంలోనే ఓ అపురూప, అద్భుత ఘట్టం జరిగింది. ఇప్పటి కరీంనగర్‌ జిల్లా జిగిత్యాల ప్రాంతంలోని పోలవలసను పాలించే గిరిజనదొర మేడరాజు కూతురు సమ్మక్క. ఈమెను మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. వీరికి పుట్టిన బిడ్డలే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. అప్పటి వరకు ప్రతాపరుద్రుడికి సామంతులుగా ఉంటూ కప్పం కడుతూ వచ్చిన మేడారం పాలకులు ఆ ఏడాది కరువు కాటకాల వల్ల కప్పం కట్టలేకపోతారు. దీంతో రాజ్యంతో ఘర్షణ ఏర్పడుతుంది.కాకతీయుల సైన్యం, సమ్మక్క సైన్యం మధ్య జరిగిన యుద్ధం కాకతీయ చరిత్రలోనే మరపురాని ఘట్టం. గెరిల్లా యుద్ధానికి నాంది పలికింది కూడా ఇక్కడే. ప్రతాపరుద్రుడి సైన్యంతో వీరోచితంగా పోరాడారు సమ్మక్క, సారలమ్మలు. పగిడిద్దరాజు, సారలమ్మ యుద్ధ భూమిలోనే మరణిస్తారు. ఓటమిని జీర్ణించుకోలేని జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగానే పిలుస్తారు. సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తుంది కాకతీయ సైన్యం. వెనుక నుంచి బళ్ల్లెంతో పొడుస్తుంది. రక్తధారలతో సమ్మక్క యుద్ధ భూమి నుంచి నిష్ర్కమిస్తూ మేడారానికి ఈశాన్యాన ఉన్న గుట్ట దగ్గర అదృశ్యమౌతుంది. అదే చిలుకలగుట్టగా నేడు సుప్రసిద్ధం.

చిలుకలగుట్ట వెనుక కుంకుమ భరిణి
సమ్మక్క అంతర్ధానమైన చోట ఓ కుంకుమ భరిణి లభించిందన్నది స్థానికుల నమ్మకం. ఆ భరిణను పూజారులు చిలుకలగుట్ట వెనుక భద్రపరిచారు. ఆ భరిణనే సమ్మక్క అని గిరిజనుల అపార నమ్మకం. వీరవనితే దేవతగా మారి తమకోసం మళ్లీ తిరిగి వచ్చిందన్నది వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే సమ్మక్క, సారలమ్మలంటే గిరిజనులకింత మమకారం. అందుకే అమ్మను నెత్తినపెట్టుకొని పూజిస్తారు. సంబరం చేస్తే అంబ పలుకుతుందని నమ్ముతారు. ఈ అచంచలమైన విశ్వాసంలోంచి పుట్టిందే గిరజన కుంభమేళ. సమ్మక్క, సారాలమ్మల శౌర్యానికి, త్యాగానికి ప్రతీకయే ఈ మేడారం జాతర. చిక్కగా పరుచుకున్న పచ్చదనం. కింద ఎర్రని మన్ను..ఎత్తైన కొండ..కొండ దిగువన వాగు..వాగు చట్టూ అడవి. అడవి మధ్యలో పల్లె. పల్లె మధ్యలో గద్దె..ఈ గద్దె గిరిజనులకు దేవి శక్తిపీఠం. గద్దె చుట్టూ లక్షల జనం. అన్ని అద్భుతాలు కలిస్తే మేడారం. అందరి మనసులు కలిస్తే మేడారం. ప్రకృతిని తమలో మమేకం చేసుకుంటే మేడారం. రెండేళ్ల కోసారి మాఘశుద్ధపౌర్ణమి గడియల్లో మేడారం జాతర జరుగుతుంది. మేడారం గద్దెల నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను గద్దెల మీదికి తీసుకు రావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇదే రోజున ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి ఆమె తండ్రి పగిడిద్దరాజులు కూడా గద్దెల వద్దకు చేరుకుంటారు.

జాతర ప్రాంగణంలో నాలుగు గద్దెలు
మొత్తంగా మేడారం జాతర ప్రాంగణంలో నాలుగు గద్దెలు కనిపిస్తాయి. మొదటి రోజు 31వ తేదీన సారలమ్మకు గద్దెకు తీసుకువచ్చే క్రమం గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది. కన్నెపల్లి గ్రామంలో గిరిజనులు మేళతాళాలతో, డోలు వాయిద్యాలతో సారలమ్మను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరుతారు. మొత్తం ఆరుగురు పూజారులు సారలమ్మకు పూజలు నిర్వహిస్తారు. కాక వంశీయులు సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. పోలీసు అధికారుల తుపాకీ కాల్పుల గౌరవ వందనాలు, సంప్రదాయ ఎదురుకోళ్ల ఘట్టంతో భక్తులు సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. రెండో రోజైన గురువారం అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయమే సమ్మక్క పూజారులు వనదేవత గుట్టకు వెళ్లి వెదురు కర్రలు తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సమ్మక్క పూజారులు ఐదుగురు. సిద్ధబోయిన, కొక్కెర, చందా వంశీయులు సమ్మక్క పూజారులుగా కొనసాగుతారు. చిలుకల గుట్టపై నార చెట్టుకింద ఉన్న కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. ప్రధాన పూజారి ఒక్కడే గుట్టపైకి వెళ్లి సుమారు 3గంటల పాటు అతి రహస్యంగా పూజలు చేస్తారు. గుట్టపై నుంచి పూజారి కిందకు రాగానే జిల్లా ఎస్పీ తన ఆయుధంతో గాల్లోకి మూడు సార్లు కాల్పులు జరిపి అధికార వందనంతో సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. మాఘశుద్ధ పౌర్ణమి సమయానికి లక్ష్మీ దేవరలు కూడా మేడారం చేరుకుంటారు. నాయకపోడ్‌ల ఆరాధ్య దైవమైన లక్ష్మీ దేవరలు గుర్రపు మూతితో రంగురంగుల వస్త్రాలు అలంకరించుకుని తాడ్వాయి నుంచి మేడారం వరకు సాగుతాయి. ఆ ప్రాంగణమంతా.. అశేష జనంతో.. కిటకిటలాడుతుంది. రాష్ట్రంతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి.. వచ్చే భక్తులతో.. కిక్కిరిసిపోతుంది. జయజయ ధ్వానాలతో.. మారుమోగిపోతుంది. పూనకాలతో ఊగిపోతారు.

సుమారు పది రకాల మొక్కుబడులు
వనదేవతలు గద్దెలపై కూర్చున్నారు. ఇక సమ్మక్క, సారలమ్మలకు మోకరిల్లితే తల్లి సల్లంగా చూస్తుందని భక్తులకు విశ్వాసం. అందుకే ఆమెకు తీరొక్కగా మొక్కుతారు. ఒకటి కాదు రెండు కాదు ఎవరికి తోచినట్టుగా వారు, ఎవరి సామర్థ్యానికి తగ్గట్టుగా వారు మొక్కులు చెల్లిస్తారు. ఎందుకంటే ఎలా పిలిచినా అమ్మపలుకుతుందని, భక్తిగా ఎంత సమర్పించుకున్నా సంతోషిస్తుందని గిరిజనుల నమ్మకం.సమ్మక్క, సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. జాతరలో సుమారు పది రకాల మొక్కుబడులు ఉంటాయి. ఇవి నాగరికులకు వింతగా అనిపించినా విశేషంగా ఆకట్టుకుంటాయి. వరం పట్టటం, తలనీలాలు, వడిబియ్యం, తొట్టెలు, బంగారం, పిట్ట, బాషింగం, కోడెను కట్టటం, ఎదురుకోళ్లు, తులాభారం వంటి మొక్కులను భక్తులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా గిరిజనుల ఇంట ఏ బిడ్డ క్యార్‌మన్నా తొలుత ఆ చంటిబిడ్డ మేడారానికి రావల్సిందే. జంపన్నవాగు దగ్గర తలనీలాలు సమర్పించి అమ్మవార్ల దర్శనం చేసుకోవల్సిందే. తమ పిల్లల తలవెంట్రుకలు ఇక్కడ తీస్తే వాళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు గిరిజనులు. అందుకే ఆమెకు తలనీలాలు ఇచ్చి మొక్కుబడి చెల్లించుకుంటారు.

సంతానం లేని వాళ్లు తొట్టె కడతారు 
సంతానం లేని వాళ్లు తొట్టె కడతామని మొక్కుకుంటారు. జంపన్న గద్దెను ఆనుకొని ఉన్న ఒద్దిమాను చెట్టుకు తొట్టె కట్టి మొక్కును చెల్లించుకుంటారు. ఇలా వేల సంఖ్యలో తొట్టెలు దర్శనమిస్తాయి.కోడెను కట్టే సంప్రదాయం మేడారం జాతరలో ప్రత్యేకమైంది. సమ్మక్క గద్దెకు పడమర వైపు కోడెను కడతారు. ఆ తరువాత కోడెతో మూడు సార్లు సమ్మక్క గద్దె దగ్గర ప్రదక్షిణం చేస్తారు. కోడిపిల్లను అమ్మవార్ల గద్దెల ఎదుట ఎగుర వేస్తారు. దీన్నే ఎదురుకోళ్ల మొక్కు అంటారు. అలా అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు.ఇక వడిబియ్యం మొక్కు. కిలోంపావు బియ్యంలో ఖర్జూరపండ్లు, తమలపాకులు, కొత్త వస్ర్తాన్ని ఉంచి దాన్ని నడుముకు కట్టుకుంటారు. నడుముకు కట్టుకున్న బియ్యంతోనే అమ్మవారి గద్దెలకు వచ్చి ఆ మొక్కును సమర్పిస్తారు.ఇక మరో ప్రధానమైన మొక్కుబడి బంగారం సమర్పించుకోవడం ఒకటి. బంగారం అంటే బంగారం కాదు.. బెల్లం.. అమ్మవార్లకు మొక్కులు ఉన్నా లేకపోయినా బెల్లం సమర్పించుకోవడం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీ చాలా అబ్బురంగా జరుపుకుంటారు గిరిజనులు. దీంతో వందల క్వింటాళ్ల కొద్ది బెల్లం మేడారం బాట పడుతుంది. కేవలం 70 ఇళ్లు మాత్రమే ఉండే మేడారం గ్రామం. కోట్ల మందికి తాత్కాలికంగా నీడనిస్తోంది. జాతర సమయంలో భక్తులు ఉండేందుకు ప్లాట్ల కింద కిరాయికి కేటాయిస్తున్నారు. 1968 వరకు మేడారం జాతర రెవెన్యూ ఆధీనంలో ఉండగా, ఆ తర్వాత దేవాదాయ శాఖ పరిధికి తీసుకువచ్చారు. 1996లో మేడారం జాతరను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేపట్టింది.

జాతరకు వంద కోట్ల నిధులు
ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు వంద కోట్ల నిధులు కేటాయించగా ఇందులో తాత్కాలిక పనులకే పెద్ద పీట వేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం.. క్యూలైన్లు, టాయ్ లెట్స్, వాటర్ ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం మూడు నెలలుగా కసరత్తు చేస్తోంది. పనులను జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మేడారం జాతరకు సంబంధించి ఆదాయం కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుండటంతో ఈ ఏడాది 250 ఐరన్ హుండీలు, మరికొన్ని క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. వైద్యం, పారిశుధ్యం, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే జాతర కోసం వెళ్లిన భక్తులు.. చిన్నచిన్న ఇబ్బందులను ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా నీటి సరఫరా సరిగా లేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. ప్రతి ఏటా.. జాతరకు వచ్చే.. భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. ప్రభుత్వం మౌలిక వసతులు సంపూర్ణంగా.. ఏర్పాటు చేయాలని.. భక్తులు కోరుతున్నారు. నేషనల్ ఫెస్టివల్‌గా ప్రకటించాలని, గిరిజనుల సంప్రదాయానికి పెద్ద పీట వేయాలని పలువురు కోరుతున్నారు. జాతరకు సర్వంసిద్ధమైంది.. భక్త జనసందోహంతో.. ఆ నేల పులకించనుంది. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి కోట్లాది మంది భక్తులు ఒళ్లంత కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. రెండేళ్లకోసారి సంబరం. పదేళ్లకు సరిపడా ఆనందం. ఇదే మేడారం జాతరలోనే గొప్పతనం..కమ్మదనం. నాలుగు రోజుల పాటు ఆనందోత్సాహాల మధ్య జరిగే మేడారం జాతర సమ్మక్కల సారాలమ్మల వనవాస ప్రవేశంతో ముగుస్తుంది. కాని ఈ నాలుగు రోజుల పారవశ్యాన్ని గుండెల నిండా నింపుకొని తిరుగు బయలెల్లుతారు గిరిజనులు. మళ్లీ రెండేళ్లకు వస్తామని చెప్తూ అమ్మవార్లను కన్నీళ్లతో సాగనంపుతారు. మళ్లీ మార్గశిర పూర్ణిమ ఎప్పుడు వస్తుందా అని ఆ గద్దెలవైపు చూస్తూఉంటుంది ఏటూరునాగారం.

Don't Miss