అధికార నేతల దందా..సర్కార్ ఆదాయానికి గండి..

08:53 - April 10, 2018

మిర్యాలగూడ : అక్కడ అధికార పార్టీ నేతలదే హవా. వారి అండదండలతో చోటా నాయకులు రెచ్చిపోతున్నారు. మున్సిపాలిటీలు, పంచాయితీలలో ఇష్టారీతిన వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో స్వయం ఉపాధిని పొందాలనుకున్న యువతకు నిరాశే మిగులుతోంది.

ప్రహసనంగా మారిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల వ్యవహారం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల వ్యవహారం ప్రహసనంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది మిర్యాలగూడ. పదేళ్ల క్రితం ఇక్కడ మున్సిపాలిటీకి అనుబంధంగా ప్రధాన రహదారి వద్ద బస్టాండ్‌కు సమీపంలో వ్యాపార సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 66 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 3వేలు కిరాయిగా నిర్ణయించారు. అంటే 66 దుకాణాలకు కలిపి మొత్తం లక్షా 98 వేల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది.

పెరిగిన ధరల ప్రకారం ఒక్కో దుకాణానికి రూ. 8వేలు కిరాయి
అయితే ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం తాజాగా టెండర్లను ఆహ్వానిస్తే నెలకు ఒక దుకాణానికి 8వేల చొప్పున మొత్తం 5 లక్షల 28వేల ఆదాయం మున్సిపాలిటీకి చేరుతుంది. అంటే సుమారు 12 శాతం ఆదాయం పెరుగుతుంది. ఈ లెక్క ప్రకారం ఏడాదికి 63 లక్షల 36 వేల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చే అవకాశం ఉండగా... కేవలం 23 లక్షల 76 వేల ఆదాయం మాత్రమే వస్తోంది. దుకాణాలను లీజుకు తీసుకున్న చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా సబ్‌లీజుకి ఇచ్చి భారీగా ఆదాయం పొందుతున్నారు. మున్సిపాలిటీకి ఒక షాపుకు ఏడాదికి 36వేలు మాత్రమే కడుతూ... సబ్‌ లీజు కింద 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. పైగా ఒపెన్ టెండర్లను పిలవకుండా లీజుదారులు అడ్డుపడుతున్నారు. దళారుల నిర్వాకం ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న ఎందరో నిరుద్యోగులకు భారంగా మారింది.

ప్రతి ఏటా 10-20 శాతం కిరాయి పెంచుతున్న దళారులు
దళారులు ప్రతి సంవత్సరం 10 నుండి 20 శాతం కిరాయి పెంచుతూ ఇష్టానుసారం కిరాయి వసూలు చేస్తున్నారు. టెండర్లు ఆహ్వానించి మార్కెట్‌ రేట్‌ ప్రకారం దుకాణాలు కేటాయించినా ఏడాదికి లక్ష రూపాయల లోపే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా తెలిసినప్పటికీ అధికారులు దళారులకు సహకరిస్తూ అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వింటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరిగిన ధరల ప్రకారం మున్సిపాలిటీకి అందని ఆదాయం
ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం మున్సిపాలిటీకి ఆదాయం అందడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా తాజాగా టెండర్లు నిర్వహిస్తే కిరాయి పెరిగి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాని అధికారులు పాలకవర్గం తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెండర్ల అంశాన్ని ఏదో సాకుతో దాటవేస్తూ వస్తున్నారు. వీటితో పాటు నాలుగేళ్లక్రితం ఇదే సముదాయంలో మొదటి అంతస్తులో దుకాణాలు నిర్మించారు. మొత్తం 90 దుకాణాలకు ఇప్పటికీ టెండర్లు లేక ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బహిరంగ వేలానికి టెండర్లు ఆహ్వానించినా కిరాయి ఎక్కువగా ప్రకటించడంతో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఈ టెండర్లను రద్దు చేశారు. అదే సమయంలో డిమాండ్‌ ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోని దుకాణాలకు మాత్రం టెండర్లను వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి టెండర్లు
నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒక సారి దుకాణాలకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. మొదట టెండర్లు దక్కించుకున్న వారు పాలకవర్గం సహకారంతో కోర్టులను ఆశ్రయించి ప్రక్రియను పొడగించుకుంటూ వెళ్తున్నారు. కనీసం కోర్టుల్లో కూడా కౌంటర్‌ దాఖలు చేయకుండా ఐదేళ్లుగా మున్సిపల్‌ అధికారులు జాప్యం వహించడంతో స్థానికులు మండిపడుతున్నారు. తాజాగా జారీ చేసిన టెండర్ల ప్రకటనపైనా కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. అయితే లీజుదారులను వెంటనే ఖాళీ చేయించకుండా కొంత సమయం ఇవ్వాలని కోర్టు అనుమతిచ్చింది. అంతే కాని టెండర్లను రద్దు చేయాలని కాని నిలిపివేయాలని కాని కోర్టు ఆదేశాలివ్వలేదు. కాని దీనినే సాకుగా చూపి మొత్తం టెండర్లనే రద్దు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. టెండర్ల గడువు ముగిసినా ఇంతవరకు వాటిని ఒపెన్‌ చేయలేదని.... ఈ పేరుతో భారీగా డిపాజిట్లు చెల్లించిన ఆశావహులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులపై చర్యలు తీసుకొని టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టెండర్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తోన్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగలక్ష్మి భర్త
ఈ టెండర్ల వ్యవహారంలో స్థానిక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగలక్ష్మి భర్త భార్గవ్‌ టెండర్ల రద్దులో కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నుండి గెలిచిన చైర్‌ పర్సన్‌ పీఠాన్ని కాపాడుకోవడం కోసం కొంత కాలం క్రితం అధికార పార్టీలో చేరారు. ఇప్పుడు అధికారులను సైతం బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లీజుదారులకు గడువు పొడగింపులో అధికారులు కోర్టును ఆశ్రయించకపోవడం...అదే విధంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అడ్డంపెట్టుకొని మొత్తం టెండర్ల ప్రక్రియను దారి మళ్లించడంలో ఆయన పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సబ్‌ లీజుకి ఇచ్చిన చాలా మంది నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని టెండర్లను నిలుపు చేసినట్లు వ్యాపారులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.

కోర్టు ఆదేశాలతోనే వాయిదా వేశామంటున్న మున్సిపల్‌ కమిషనర్‌..
అసలు లీజుదారులను వెంటనే ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటు టెండర్లకు పెద్దగా స్పందన లేకపోవడం వల్లనే టెండర్లను వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సత్యంబాబు చెబుతున్నారు. కోర్టు కేసు ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు. మొదటి ఫ్లోర్‌లో నూతనంగా నిర్మించిన వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించామని.. వాటికి మరోసారి టెండర్లు పిలుస్తామన్నారు.

విధులు బహిష్కరించి ఆందోళన బాట పడుతోన్న కార్మికులు..
ఇదంతా ఒక ఎత్తయితే మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిఏటా రెండు సార్లు కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పడుతున్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఆదాయం నుండే కార్మికుల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఆదాయంలేకే వేతనాలు ఆలస్యమవుతున్నాయిని అధికారులు చెబుతున్నారు. అయితే పాలకవర్గం కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్లను వాయిదా వేస్తూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇప్పటికైనా అధికారులు.... రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనివలన మున్సిపాలిటీ ఆదాయం పెరగడంతో పాటు అసలు దుకాణాదారులకు అండగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. 

Don't Miss