ప్రయోగాల ప్రభాకర్

15:34 - September 3, 2017

కరీంనగర్/జగిత్యాల : శ్రమ... సృజనాత్మకత...వెరసి ప్రభాకర్‌..తక్కువ ఖర్చుతో... ఎక్కువ ఉపయోగపడే పరికరాల సృష్టికర్త..పట్టా లేకున్నా.. సత్తా ఉన్న గ్రామీణ ఇంజనీర్‌..జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఇతడి పేరు ప్రభాకర్...! అనేక ప్రయోగాలకు.. కొత్త పరికరాలకు కేరాఫ్‌ అడ్రస్‌! ... సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేయడంలో ప్రభాకర్ నేర్పరి. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం కలిగిన ప్రభాకర్ వినూత్న వస్తువులను తయారు చేస్తూ... అందరినీ అబ్బురపరుస్తున్నాడు. చాలామంది యువకులకు శిక్షణ ఇచ్చి.. ఉపాధిని కల్పిస్తున్నాడు.

ఆటోమెటిక్ జనరేటర్ స్టార్టర్
1988లోనే ప్రభాకర్ తన తండ్రి వద్ద నేర్చుకున్న ఎలక్ట్రిక్‌ విద్యతో ఆటోమెటిక్ జనరేటర్ స్టార్టర్‌ను తయారు చేసి పేటెంట్ హక్కు పొందాడు. తన ఇంటి ఎదుటనే ప్రభాత్ ఇండస్ట్రీస్‌ అనే సంస్థను నెలకొల్పి చాలామంది నిరుద్యోగులకు పీసీ మెకానిజం, టిగ్ అండ్ ఆర్క్ వెల్డింగ్ వర్క్, శానిటేషన్ లాంటి పనులలో శిక్షణ ఇస్తూ.. వారికి జీవనోపాధిని అందిస్తున్నారు. అలాగే తక్కువ ఖర్చుతో... ఎక్కువ ఉపయోగపడే విధంగా అనేక వస్తువులను తయారు చేసి.... అన్ని రంగాల ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభాకర్‌ కనుగొన్న వాటిలో... అద్భుతమైనవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, రోగులను దృష్టిలో పెట్టుకుని... తయారు చేసిన మంచం... అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సకల సౌకర్యాలను కల్పిస్తూ... బెడ్‌ను రూపొందించారు. కాలకృత్యాలు తీర్చుకోవడం మొదలు... స్నానం చేయడానికి కూడా ఈ బెడ్‌పై అవకాశం ఉంది. అన్నం తినడానికి... బోర్‌ కొట్టినప్పుడు చూడడానికి టీవీని కూడా అమర్చారు.

లక్ట్రికల్‌ పోల్ ఎక్కే చెప్పులు
ప్రభాకర్ తయారు చేసిన వాటిల్లో మరో ముఖ్యమైన పరికరం.. బోర్‌ వెల్‌ పుల్లింగ్‌ మిషన్‌ ఒకటి... మోటార్‌ అవసరం లేకుండా... ఈ మిషన్‌ పనిచేస్తోంది.చేతితో ఆపరేట్‌ చేసే విధంగా దీనిని తయారు చేశారు. అలాగే సౌర శక్తిని వృథా చేయకుండా పూర్తిగా వినియోగించుకునేలా ట్రాకింగ్ సోలార్ సిస్టం రూపొందించారు. అలాగే మురుగు కాల్వలో చెత్తను తీసి శుభ్రం చేసే యంత్రాన్ని తయారు చేశారు. రైతులు పొలాల్లో కలుపు మొక్కలను తీయడానికి సైతం చిన్న పరికరాన్ని రూపొందించారు. అలాగే పత్తి పంటలకు చెట్టు వద్దే ఎరువులు పడే విధంగా...ట్రిగ్గర్ పరికరాన్ని తయారు చేశారు. అలాగే విద్యుత్ లైన్ మెన్‌ల కోసం అతి సులభంగా ఎలక్ట్రికల్‌ పోల్ ఎక్కే చెప్పులను, 360 డిగ్రీల్లో తిరిగే జంబో కూలర్‌ను తయారు చేశారు. దొంగతనాలను నివారించేందుకు సేఫ్‌ గార్డ్‌ సైరన్‌ను... మురికి నీరు పైకి పోయి... చెత్త అంత పైన నిలిచిపోయే విధంగా మరో పరికరాన్ని ఆవిష్కరించారు. అయితే ప్రజలకు ఉపయోగపడే.. ఎన్నో పరికరాలను తయారుచేసే... ప్రభాకర్‌కు మాత్రం... ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించడం లేదని కుటంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా... కనీసం గ్రాడ్యుయేషన్‌ కూడా చేయని... ఈ గ్రామీణ ఇంజనీర్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ప్రయోగాల ప్రభాకర్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే.. మరిన్ని పరికరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Don't Miss