నిజామాబాద్ లో రైల్వే సమస్యలు

13:44 - January 3, 2018

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నిజాం నవాబుల కాలంలో వేసిన సికింద్రాబాద్‌-మన్మాడ్‌ మీటర్‌ గేజ్‌ రైల్వే లైన్‌ను బ్రాడ్‌ గేజ్‌గా మార్చడం మినహా... ఇప్పటి వరకు జిల్లాకు కొత్తగా వచ్చిన ప్రాజెక్టులేమీ పెద్దగా లేవు. జిల్లాలో ఉన్న రైలు మార్గాల డబ్లింగ్‌కు నోచుకోలేదు. ఈ విషయంలో జిల్లా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు ఇచ్చిన హమీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. డబ్లింగ్‌ పనులకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చినా... పట్టించుకునే దిక్కు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అతీగతీ లేదు. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ మార్గంలో ఇంకా చేపట్టలేదు. సింగిల్‌ లైన్‌ కావడంతో రైళ్లు పట్టాలు తప్పినా, సాంకేతిక సమస్యతో ఆగిపోయినా ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు.

నిజామాబాద్‌-పెద్దపల్లి రైల్వే లైన్‌ను పూర్తి
సోయా, ధాన్యం, బియ్యంతోపాటు ఇతర సరకు రవాణా కూడా ఎక్కువగానే జరుగుతోంది. అయినా డబ్లింగ్‌ గురించి పట్టించుకోవడంలేదు. ఇక్కడ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత నిజామాబాద్‌-పెద్దపల్లి రైల్వే లైన్‌ను పూర్తి చేయించారు. సికింద్రాబాద్‌-మన్మాడ్‌ లైను మీటర్‌గేజ్‌గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చమురు డిపోలకు ముంబై నుంచి ఆయిల్‌ తరలించి తెలంగాణ జిల్లాలకు సరఫరా చేసేవారు. గేజ్‌ మార్పిడి సమయంలో ఆయిల్‌ సరఫరా నిలిచిపోవడంతో హెచ్‌పీసీఎల్‌, బీసీసీఎల్‌ డిపోలు ఇక్కడ నుంచి కొండపల్లి తరలిపోయాయి. ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే ఆయిల్‌ డిపోలకు పునఃప్రారంభించే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్న కొత్త రైల్వే లేన్లకు మోక్షం లేదు. నిజామాబాద్‌-ఆదిలాబాద్‌, బోధన్‌-బాన్సువాడ-బీదర్‌ రైల్వే లైన్లకు సర్వే పూర్తైనా నిధులకు మోక్షం లభించలేదు. ఈ ప్రాజెక్టులను కూడా నేతలు పట్టించుకోవడంలేదు. నిజామాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన డివిజన్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిపోయింది. ప్రజాప్రతినిధుల ఉదాసీన వైఖరే ఇందుకు కారణమన్న నిజామాబాద్‌ కేంద్రంగా కోచ్‌ రిపేర్‌ వర్క్‌ షాపు ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన హమీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గ్యాంగ్‌మెన్‌ శిక్షణా కేంద్రం కూడా అతీగతీ లేదు. హైదరాబాద్‌ డివిజన్‌లో కాచిగూడ తర్వాత నిజామాబాద్‌ స్టేషన్‌ నుంచే ఎక్కువ కలెక్షన్‌ వస్తోంది. అయినా ప్రయాణికుల సౌకర్యాలు శూన్యం. వచ్చే బడ్జెట్‌లోనైనా నిజామాబాద్‌ జిల్లా రైల్వే ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యే విధంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

Don't Miss