పవన్‌కు వరుస కష్టాలు

12:47 - January 13, 2018

హైదరాబాద్ : జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు కాలం కలిసిరావడం లేదా? సినిమాల పరంగా పవన్‌ పవర్‌ తగ్గుతోందా? రాజకీయంగా జనసేనాని జనంలోకి వెళ్లలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు.  ఒక పక్క  సినిమాలు ప్లాప్‌. ఇంకోపక్క రాజకీయ విమర్శలు. మరోపక్క వ్యక్తిగత ఆరోపణలు... వెరసి పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.  పవన్‌కు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై 10టీవీ కథనం..
జనసేనానికి కలిసిరాని కాలం
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వరుస కష్టాలతో సతమతమవుతున్నారు. పవన్‌కు కొన్నాళ్లుగా కాలం కలిసిరావడం లేదు. దీంతో ఆయన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు... పవన్‌ వ్యక్తిగత ప్రతిష్టకూడా దెబ్బతింటోంది. 
విమర్శలకు తావిస్తోన్న పవన్‌ తీరు
జనసేన పార్టీ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు పార్టీకి పవన్‌ ఓ రూపం తీసుకురాలేకపోయారు. ప్రజాసమస్యలపై అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నా... పవన్‌ను ప్రజలు పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌గానే భావిస్తున్నారు. అంతేకాదు... ఏపీ సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మాత్రమే పవన్‌ బయటకు వస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. జగన్‌ పాదయాత్ర మొదలుకాగానే.. పవన్‌ ఏపీలో పర్యటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిపోయి.. ప్రతిపక్షంపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు.  ఇది అనేక విమర్శలకు దారితీసింది. అంతేకాదు.. ప్రజారాజ్యంపార్టీ , పరిటాల రవితో తనకు జరిగిన అవమానం వివరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజకీయ విమర్శలతోపాటు.. పవన్‌ రాజకీయ అవగాహననే ప్రశ్నించేలా చేశాయి. 
పవన్‌ టార్గెట్‌గా కత్తి మహేష్‌ విమర్శలు
పవన్‌ ఫ్యాన్స్‌కు  - కత్తి మహేష్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కత్తి మహేష్‌... పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌గా అనేక విమర్శలు చేస్తున్నారు. దీంతో పవన్‌ మౌనం వహించడమెందుకన్నది సామాన్యుల ప్రశ్న. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్‌పై కత్తి చేసే విమర్శలకు ఆయన అభిమానులు అతిగా స్పందిస్తుండడం జనసేనానికి ఇబ్బందిగా మారుతోంది. 
డిజాస్టర్‌గా మిగిలిన అజ్ఞాతవాసి
పవన్‌పై వస్తున్న రాజకీయ విమర్శలకు, కత్తి మహేష్‌లాంటి వాళ్లు చేసే ఆరోపణలకు  సినిమా ద్వారా చెక్‌పెట్టవచ్చని అభిమానులు భావించారు. సంక్రాంతి రేస్‌గా వచ్చిన అజ్ఞాతవాసి హిట్‌ అయితే ఈ విమర్శలన్నిటీ సమాధానం చెప్పినట్టవుతుందని అనుకున్నారు. కానీ ఎన్నో అంచనాల మధ్య రిలీజైన అజ్ఞాతవాసి సాధారణ ప్రేక్షకుడి మాట అటుంచితే... పవన్‌ అభిమానిని కూడా మెప్పించలేకపోయింది. పవన్‌ సినీ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 
పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?  
ఈ మధ్య కాలంలో పవన్‌కు అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్‌ కలిసిరావడం లేదు. సినిమాలు నిరాశపర్చడంతో పవన్‌ ఇప్పటి నుంచైనా పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారా? లేక మరో సినిమాకు సిద్ధం అవుతారా? అన్నది ఆయన అభిమానులను కలవరపెడుతోంది. మరి పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

Don't Miss