పిచ్చిమొక్కలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కోడూరు ప్రభుత్వ జూ.కాలేజి

20:12 - February 1, 2018

కడప : ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ కళాశాల అది. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన కళాశాల ప్రాంగణం పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. పగలు పందుల స్వైర విహారానికి, రాత్రి మందుబాబులకు అడ్డాగా మారింది కడప జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. 

ఇదే ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేసిన కడప జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఇందులోనే ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎందరో పెద్ద పెద్ద ఉద్యోగాలలో రానిస్తున్నారు. పచ్చపచ్చని చెట్లు, పూలమొక్కలతో నిండి ఉండాల్సి ప్రాంగణం పిచ్చి మొక్కలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. చెత్తా చెదారం నిండి పోయి పందుల స్వైర విహాంతో కంపుకొడుతోంది. 

చూసేందుకు అరణ్యంలా తలపిస్తున్న ఈ కాలేజీ గ్రౌండ్‌ను కాలేజీ యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఇదే ఆసరాగా తీసుకున్న మందుబాబులు రాత్రి అయ్యే సరికి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు మందుబాబులు గ్రౌండ్‌లోకి చేరి జల్సాలు చేస్తున్నారు. తరగతి గదుల్లో మందు బాటిళ్లు దర్శనమివ్వడంతో  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఈ కలేజీ కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి క్రీడల కోసం బిల్డింగ్‌ను అసంపూర్తిగా కట్టి వదిలేశారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్‌ గొర్రెలు, మేకలు సేద తీరేందుకు పనికివస్తుంది. కాలేజీ గ్రౌండ్‌ పెద్దగా ఉండటంతో ఉదయంపూట నడక కోసం స్థానికులు వస్తుంటారు. చిన్న పిల్లలు, విద్యార్థులు ఆటలు ఆడేందుకు గ్రౌండు సౌకర్యంగాలేదు. దీంతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇక కళాశాల భవనం విషయానికి వస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. తలుపులు కిటికీలు చెదలు పట్టి ఊడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితి చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలో చేర్పించడంలేదు. ప్రైవేటు కాలేజీలను ఆశ్రయించడంతో అధిక ఫీజుల బారిన పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కాలేజీని అభివృద్ధి చేయాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. 

Don't Miss