నష్టాలబాటలో 'సింగరేణి'...

12:21 - January 10, 2017

హైదరాబాద్ : నల్లబంగారానికి నష్టాల మసి అంటుతోంది... లాభాలపంట పండించిన సింగరేణిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి... టార్గెట్‌కు తగినంత ఉత్పత్తిలేకపోవడం.... దీనికితోడు అమ్మకాలు తగ్గడం సంస్థకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది.. ఈ నష్టాలనుంచి సంస్థను బయటపడేదిశగా అధికారులు చర్యలు చేపట్టినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు.. సింగరేణిలో నష్టాలకు కారణమేంటి? స్పెషల్ ఫోకస్..
తిరోగమన దిశగా సంస్థ
సిరులగని సింగరేణి సంస్థ నష్టాలబాటలో ప్రయణిస్తోంది.. సంస్థ నిర్వహణ ఖర్చులకూ... ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ నష్టాల్లో కూరుకుపోకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. విదేశీబొగ్గుతోపోటీ... భూగర్భ గనులనుంచి బొగ్గు వెలికితీసే వ్యయం పెరిగిపోవడంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. ఒకప్పుడు భారీలాభాలతో కాసులపంటపండించిన సంస్థ ఇప్పుడు తిరోగమనందిశగా సాగుతోంది.. 
అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోన్న సింగరేణి 
బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోంది.. 2016 17 సంవత్సరంలో దాదాపు 66 మిలియన్ టన్నుల బోగ్గు ఉత్పత్తి  చేయాలని సంస్థ టార్గెట్‌గా పెట్టుకుంది.. 2016 డిసెంబర్‌లోగా 46 మిలియన్‌ టన్నుల నల్లబంగారాన్ని వెలికితీయాలని భావించినా .... 42 మిలియన్‌ టన్నుల బొగ్గును మాత్రమే బయటకు తీయగలిగింది.. దాదాపు నాలుగున్నర మిలియట్‌ టన్నులు తక్కువగా బొగ్గును ఉత్పత్తిచేసింది... ఇలా ఆశించిన స్థాయిలో బొగ్గును వెలికితీయలేకపోవడం కూడా నష్టాలకు ఒక కారణమవుతోంది.. 
బొగ్గు అమ్మకాల్లోనూ సమస్యలు
బొగ్గుగనులనుంచి బయటకుతీసిన నల్లబంగారం అమ్మకాల్లోనూ సంస్థకు సమస్యలు ఎదురవుతున్నాయి... బహిరంగ మార్కెట్లో విదేశాలనుంచి దిగుమతిచేసుకున్న బొగ్గు సింగరేణికి గట్టి పోటీ ఇస్తోంది... విదేశీ బొగ్గు మంచి నాణ్యతతోఉండటం... పైగా తక్కువ ధరకు రావడంతో సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యత తగ్గుతోంది.. 
బొగ్గు వెలికితీత ఖర్చు మరింత భారం 
సింగరేణిలో భూగర్భ గనుల నుంచి బొగ్గు వెలికితీత ఖర్చు సంస్థకు మరింత భారమవుతోంది.. మొత్తం సింగరేణి బోగ్గు పరిశ్రమలో  33 భూగర్భ గనులు, 18 ఉపరితల గనులున్నాయి... ఇందులో 56 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.. ఉపరితల బోగ్గు గనులనుంచి బొగ్గును వెలికితీయాలంటే టన్నుకు 1355 రూపాయలు ఖర్చవుతోంది.. ఈ బొగ్గును 1749 రూపాయలకు అమ్మడంద్వారా సంస్థకు 399 రూపాయల లాభం వస్తోంది.. అదే భూగర్భ గనుల్లో టన్ను బొగ్గును బయటకుతీయాలంటే 4వేల 596రూపాయలు ఖర్చుచేయాల్సివస్తోంది.. ఈ బొగ్గు అమ్మకంద్వారా కేవలం 2వేల 211 రూపాయలు సంస్థ ఖాతాలోకివస్తున్నాయి.. అంటే టన్ను బొగ్గుకు 2వేల 385రూపాయల నష్టం వస్తోంది. ఈ భూగర్భ గనులనుంచి వెలికితీస్తున్న బొగ్గుద్వారా మొత్తంగా 1308 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.. ఈ నష్టాన్ని ఉపరితల గనుల్లోవచ్చే లాభాలతో పూడ్చుకుంటూ సంస్థ తాత్కాలికంగా ఈ సమస్యనుంచి బయటపడుతోంది.. 
నష్టనివారణ చర్యలు 
భారీలాభాల్లో ఉన్న సింగరేణి నష్టాలబాట పట్టడంతో అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు.. ఉత్పత్తి ఖర్చును తగ్గించి... మిగతా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ప్రత్యేక ప్రణాళికద్వారా ముందుకు సాగాలని భావిస్తున్నారు.. 
సమస్య పరిష్కారంపై దృష్టి 
భూగర్భ గనులతో నష్టాలనుచూసిన అధికారులు... సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు.. ఈ గనుల్ని మూసేసి వాటిని ఓపెన్‌ కాస్ట్‌మైనింగ్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. అలాగే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందంటూ... భూమిలోపలున్న గనుల్లో యంత్రాల వాడకాన్ని పెంచారు... అయినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడంలేదు.. 
నిలిచిన బొగ్గు వెలికితీత...సంస్థపై తీవ్ర ప్రభావం 
2016 డిసెంబర్‌నాటికి భూగర్భగనుల్లో 9 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... 7 మిలియన్‌ టన్నుల నల్లబంగారాన్నిమాత్రమే వెలికితీశారు.. దాదాపు 2 మిలియన్‌ టన్నులలోటు ఉండిపోయింది... గత ఏడాదికురిసిన వర్షాలుకూడా బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందిగామారాయి... 30రోజులపాటు బొగ్గు వెలికితీత నిలిచిపోవడంకూడా సంస్థపై తీవ్రప్రభావంచూపింది.. 
సంస్థ పుంజుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు
సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యత తగ్గడం.... భూగర్భ గనులనుంచి బొగ్గు వెలికితీతకు ఖర్చు పెరిగిపోవడం.... సంస్థ అభివృద్ధికోసం పెట్టే ఖర్చు అధికమవడం.... వినియోగదారుల బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో నష్టాలు మరింత పెరిగిపోతున్నాయి.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఒక వెయ్యి ఆరు కోట్ల లాభాలను ఆర్జించింది.. 2016-17లోమాత్రం 300కోట్లుమాత్రమే లాభాలు వస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు.. గత అక్టోబర్‌నాటికి 307కోట్ల నష్టాలతోఉన్న సంస్థ డిసెంబర్లో కాస్త పుంజుకుంది.. మార్కెట్‌లో బొగ్గు డిమాండ్‌ పెరగడంతో నష్టాలు తగ్గాయి.. అయినా లాభాలు సగానికి సగం పడిపోతాయన్న అంచనాతో.... అధికారులు నష్టనివారణపై దృష్టిపెట్టారు.. సంస్థను ఆర్థికంగా పుంజుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు..

 

Don't Miss