మూలన తట్ట, చెమ్మస్‌లు

10:34 - June 21, 2017

కరీంనగర్ : వారసత్వ ఉద్యోగాల సాధన కోసం నల్ల సూర్యులు చేస్తున్న సమ్మెతో తట్ట, చెమ్మస్‌లు మూలన పడ్డాయి. యంత్రం ఆగిపోవడంతో బొగ్గు బయటకు రావడం లేదు. కార్మికుల సమ్మె దెబ్బతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. బొగ్గు గనులన్నీకార్మికులు లేక బోసి పోతున్నాయి. ఓ వైపు సమ్మె విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం కుట్ర...మరో వైపు సమ్మె పై పోలీసులు ఉక్కుపాదంమోపుతుండడంతో కోల్ బెల్ట్ లో అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది. సింగరేణిలో జరుగుతోన్న నిరవధిక సమ్మె పై 10టీవీ స్పెషల్ స్టోరీ. సింగరేణిలో కార్మికులు చేస్తున్న సమ్మెతో.. యాజమాన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుత ఉద్యమ అంతిమ లక్ష్యం వారసత్వ ఉద్యోగాలు అయినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును విప్లవ కార్మిక సంఘాలు బయట పెట్టాయి. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు నోరు మెదపక పోవడం కార్మిక వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. హక్కుల కోసం సింగరేణిలో ఇప్పటి వరకు.. 217 సమ్మెలు జరిగినా అందులో కార్మికుల డిమాండ్‌లకు యాజమాన్యం తలవంచక తప్పలేదు.

నిరసన గళాలు, ఆందోళనలు, అరెస్ట్‌లు
సింగరేణి ప్రాంతమంతా నిరసనలతో అట్టుడుకిపోతోంది. నిరసన గళాలు, ఆందోళనలు అరెస్ట్‌లతో నల్ల బంగారు నేల మరో ఉద్యమం రగులుతోంది. పోలీసులు నిర్భందం కొనసాగిస్తున్నా... అక్రమ అరెస్ట్ చేస్తున్నా కార్మికులు మాత్రం గనుల పైకి రావడం లేదు. వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో 5 జాతీయ సంఘాలు సిఐటియు, ఐఎన్టీయూసీ, ఎఐటియుసి, హెచ్ ఎంఎస్, బిఎంఎస్ సంఘాలు ఇచ్చిన పిలుపుకు మద్దతుగా.. 7 విప్లవ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సింగరేణిలో సమ్మె విజయ వంతంగా కొనసాగుతోంది. వారసత్వ ఉద్యోగాలను అమలు చేయలంటూ మార్చి 31 న కార్మిక సంఘాలు.. సమ్మెకు నోటీసులు ఇచ్చాయి. 4 సార్లు చర్చలు జరిగినా సానుకూలత లభించలేదు. జూన్ 15 నుంచి కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. 2016 అక్టోబర్ 6 న సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తూ ప్రకటన చేయడంతో వయోభారం, అనారోగ్యం, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వేలాది మంది కార్మికులు విఆర్ఎస్ కు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఫిభ్రవరి 1 న ఓ నిరుద్యోగి వారసత్వ ఉద్యోగాలపై.. హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాడు. మార్చి 16 న వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని మార్గదర్శకాలను మార్చలంటూ.. న్యాయ స్థానం తీర్పునిచ్చింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఆందోళనలు.. తీవ్ర రూపం దాల్చాయి. ఏప్రిల్ 17న హైకోర్ట్ తీర్పును సమర్ధిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. ఉద్యోగాల అమలుకు మార్గాలున్నా యాజమాన్యం విఆర్ఎస్ అమలు చేయడంలో మాత్రం.. ఆసక్తి చూపడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.

15న మొదలు..
ఈ నెల 15 న మొదలైన సమ్మె ఇవాళ్టికి 6వ రోజు గడుస్తున్నా.. కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఆర్ధికంగా చూసినట్లయితే రోజుకు 40 కోట్ల ఆదాయం వస్తుండగా.. కార్మికులకు వేతనాల రూపంలో 20 కోట్లను యాజమాన్యం చెల్లిస్తుంటుంది. అయితే ప్రస్తుత సమ్మె నేపధ్యంలో సింగరేణి సంస్థ పై పెనుభారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా యాజమాన్యం సమ్మెతో నష్టం లేదంటూ ప్రచారం చేస్తోంది. సింగరేణి యాజమాన్యం చేస్తున్న ప్రచారాన్ని కార్మిక సంఘాలు తప్పు పట్టాయి. పూర్తి స్థాయిలో కార్మికులు విధులకు హాజరై ఉత్పత్తి చేస్తే రాని ఉత్పత్తి సమ్మె జరుగుతున్న సమయంలో ఎలా వస్తుంది అంటూ ప్రశ్నించారు. 16 శాతం అధికంగా వస్తుందని చెప్తున్న యాజమాన్యం సమ్మె లేని ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉన్న తప్పుడు లెక్కలు చూపి.. మోసం చేస్తుందంటూ సిఐటియు నాయకులు ఆరోపించారు.

40 శాతం పెద్దపల్లిలో..
సింగరేణి సంస్థ చేసే బొగ్గు ఉత్పత్తిలో.. 40శాతం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో నుండి ఉత్పత్తి జరుగుతుంది. ఈ రీజియన్‌లో 4 ఓపెన్ కాస్ట్, 9 భూగర్భ గనులు ఉండగా రోజు వారిగా 50 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మె ప్రభావం ఇక్కడి గనులపై పడడంతో.. భూ గర్బ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోగా ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం టిబిజికెఎస్ సంఘానికి సంబంధించిన కార్మికుల సహకారంతో ఉత్పత్తి జరుగుతోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి పెద్దగా పరిగణలోకి తీసుకోనవసరం లేదని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.

టీఆర్ఎస్ అనుబంధ సంస్థ..
సింగరేణిలో కార్మికులు సమ్మె చేస్తుంటే ఈ టిఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. యాజమాన్యం వైపు ఉండడం కార్మికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. విఆర్ఎస్ ఉద్యోగాలను అమలు చేస్తామనే హమీ ఇవ్వడంతో.. టిబిజికెఎస్‌కు కార్మికులు పట్టం కట్టారు. అయితే ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీతో పాటు టిబిజికెఎస్ అవలంబిస్తున్న తీరు రానున్న ఎన్నికల పై పడే అవకాశం ఉంది. సమ్మె ప్రభావం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. యాజమాన్యం కార్మికులను ఎలాగైనా విధుల్లోకి రప్పించేందుకు తంటాలు పడుతోంది. ఎప్పుడూ లేనిది భోజన వసతి కల్పిస్తూ.. కార్మికులు విశ్రాంతి తీసుకోవాడానికి బెడ్లను గనుల పై ఏర్పాటు చేసింది. బీరు, బిర్యాని ప్యాకెట్లు అందిస్తూ మభ్య పెట్టే పనిలో పడింది. సింగరేణి చరిత్రలో లేని విధంగా సెలవు దినాన్ని పని దినంగా యాజమాన్యం ప్రకటించింది. సుదీర్ఘంగా 35 రోజుల పాటు కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో కూడా యాజమాన్యం ఇలాంటి ఆఫర్ కార్మికులకు ఇవ్వలేదు.

Don't Miss