ఆ పదవి అంటే భయమెందుకు..?

17:32 - September 10, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం ఎంపీ స్థానం పోటీకీ అభ్యర్థులు కరువవుతున్నారు. ఒకప్పుడు ఈ స్థానం నుండి గెలుపొందిన దివంగత నేతలు బొడ్డేపల్లి రాజగోపాలరావు, కింజారపు ఎర్రంనాయుడులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఎర్రం నాయుడుతో పాటు.. మాజీ ఎంపీ కిల్లీ కృపారాణి కేంద్రమంత్రులుగా కూడా పని చేశారు. అయితే 2019కి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుండి ఇక్కడ ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు.

2014లో ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్‌ నాయుడు.. ఎందుకో తన రూట్ మార్చుకున్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో నరసన్న పేట నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతల్లో ఎవ్వరూ ఎంపీగా పోటీ చేయాలన్న ఉత్సాహం చూపడం లేదు. అందుకు కొత్తగా అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పోటీకి రెడ్డి శాంతి
ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వైసీపీలో ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి శాంతి.. 2014లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వైసీపీ పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ.. టీడీపీలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడ్డి శాంతి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే 2019లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని పోటీలో నిలపాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్‌ నుండి ఎంపీ స్థానానికి పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లీ కృపారాణి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకొని టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెంనాయుడిపై పోటీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. దీంతో కాంగ్రెస్‌ తరపున అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకం.

చర్చనీయాంశంగా
ఇక మిగిలిన పార్టీలకు గట్టి అభ్యర్థులే లేని పరిస్థితుల్లో ఎంపీ స్థానంపై పోటీకి.. ప్రధాన పార్టీల నేతలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులే కాదు. వివిధ పార్టీలకు చెందిన సీనియర్లు కూడా పార్లమెంట్ వైపు చూడటం లేదు. టీడీపీలో గౌతుశ్యామ సుందర శివాజీ, గుండ అప్పల సూర్యనారాయణ లాంటి వారితో పాటు.. వైసీపీలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలాంటి వారు ఎంపీ అభ్యర్థిత్వంపై వెనక్కి తగ్గుతున్నారు. మరి ఎన్నికల సమయానికైనా నేతల్లో ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.  

Don't Miss