బీబీ పాటిల్ భూ బాగోతం

16:35 - September 8, 2017

సంగారెడ్డి : బీబీ పాటిల్‌... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజా సేవ చేస్తానని ఎంతో వినమ్రంగా చెబితే.. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని నమ్మపలికారు. కరవు నివారించి, వలసలను అరికడతానని ఊదరగొట్టారు. మూడేళ్లు గడిచిపోయినా ఒక్కటీ నెరవేరలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సాగునీరు లేకపోవడంతో కరవు తాండవిస్తోంది. తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. బీబీ పాటిల్‌ హామీలను నమ్మి నట్టేట మునిగామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమ ఎంపీ పాటిల్‌ది కాదట
అయితే ఎంపీ అనుచరులు మాత్రం తమ నేత ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని చెబుతున్నారు. కంగ్టి మండలం బోర్గిలో భారీ ఆహారశుద్ధి కర్మాగారం ఏర్పాటును విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. బోర్గిలో పెడుతున్న మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఎంపీ పాటిల్‌ది కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజల ఉపాధి కోసం పెడుతున్నదని అంటున్నారు. అయితే ఇది స్వయాన ఎంపీకి చెందినదేనని విపక్షాలు చెబుతున్నాయి. బీబీ పాటిల్‌ పెడుతున్న మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ భూముల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ రేటుకు కొనుగోలు చేశారన్నఫిర్యాదులున్నాయి. ఈ పరిశ్రమతో 15 గ్రామాల రైతులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

పరిశ్రమ వ్యవహారంపై సీబీఐ విచారణ
జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కోనుగోలు చేయటాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. అయితే ఎంపీ అనుచరులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేశామన్న వాదాన్ని వినిపిస్తున్నారు. బీబీ పాటిల్‌ నిర్మాణ సంస్థ అనుబంధ విభాగం ఏర్పాటు చేస్తున్న ఆహారశుద్ధి పరిశ్రమ భూ కబ్జా వ్యవహారాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా... జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ ఇంతవరకు నోరు మెదపలేదు. అనుచరులతో వివరణ ఇప్పించి తప్పించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ కోసం సేకరించిన భూముల వివాదంపై ఎంపీ బీబీ పాటిల్‌ వివరణ ఇవ్వాలని విపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Don't Miss