సత్తా చాటుతున్న సర్కార్ కళాశాలలు..

08:10 - April 17, 2018

కొమరంభీం : ప్రభుత్వ కాలేజీలంటే అందిరికీ చిన్నచూపే.. వసతులలేమి, అధ్యాపకులు ఉండరనే భావన అందరిలోనూ ఉంది. మారుమూల మండలాల్లో వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కానీ... అదంతా గతం.. నేడు మారుమూల ప్రాంతాల్లోనూ సర్కారీ జూనియర్ కాలేజీలో వంద శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనూ నిలిచాయి... ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో వంద శాతం ఫలితాల పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..

ప్రభుత్వ కళాశాలల్లో అనూహ్య మార్పులు
ప్రభుత్వ కళాశాలలపట్ల విద్యార్థులతోపాటు.. తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపించరు. ఎందుకంటే.. సౌకర్యాలలేమి... అధ్యాపకుల కొరతతో చదువు సరిగా సాగదని వారి భావన.. కానీ.. నేడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వ కళాశాలలు సైతం ప్రథమ స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతున్నాయి..

వందశాతం ఫలితాలతో సత్తా చాటుతున్న గవర్నమెంట్‌ కాలేజీలు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆయా కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. మారుమూల మండలాల్లోని బెజ్జూర్‌, దహేగాం, కౌటాలలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగజ్‌నగర్‌ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సులోను వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సిర్పూర్ (టి) జూనియర్ కాలేజి లో 99.11% ఉత్తీర్ణత సాధించారు.

అధ్యాపకులు, తల్లిదండ్రుల్లో చైతన్యం
కుమురంభీం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందంటే.. దానికి కారణం ఇక్కడి లెక్చరర్లు, తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పులే.. మంచి ఉన్నత విద్య చదివించాలన్న చైతన్యం తల్లిదండ్రుల్లో వచ్చింది. దీనికి తోడు.. కళాశాలల్లో వసతులు కూడా మెరుగు పడ్డాయి.. మంచి క్రమశిక్షణతో విద్యార్థులను లెక్చరర్లు ప్రోత్సహిస్తూ... క్రమం తప్పకుండా కాలేజికి వచ్చేందుకు కృషి చేస్తున్నారు. మరో వైపు మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థులకు సిర్ఫూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేయూతనందిస్తున్నారు. విద్యార్థులకు మద్యాహ్నం భోజనం పెట్టి వారు చదువులో ముందుండేందుకు తోడ్పాటు ఇస్తున్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కోనప్ప ఎనలేని సహకారం అందిస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

కాగజ్‌నగర్‌ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సులో వంద శాతం
ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సైతం వంద శాతం ఫలితాలు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.. మారుమూల ప్రాంతాల్లోని కాలేజీలపై ప్రభుత్వం దృష్టి పెట్టి సౌకర్యాలు కలిపిస్తే... ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు రాణిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.

 

Don't Miss