కేసీఆర్ సారూ..ఉద్యోగాలేవి సారూ..

06:40 - April 5, 2017

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగింది. ప్రత్యేక రాష్ట్రంలోనే తమకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా విద్యార్ధులు, నిరుద్యోగ యువత కదం తొక్కింది. తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ స్వరాష్ట్రంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో అనేక హామీలను ప్రజలకు ఇచ్చి టీఆర్‌ఎస్‌పార్టీ అధికారం చేపట్టింది. ఇంటికో ఉద్యోగమిస్తామంటూ కేసీఆర్‌ ఎన్నికల సభల్లో ప్రకటించారు. తమ మేనిఫెస్టోలోనూ పొందుపర్చారు. మరి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచింది. మరి ఎంతమందికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఉద్యోగాలు ఇచ్చిందని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది..?

నిరుద్యోగుల్లో ఆందోళన..
టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన కొత్తలో నూతన ఉద్యోగాల భర్తీ కోసం కొంత ఆర్బాటం చేసిందే తప్ప ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం పోలీస్‌, విద్యుత్‌శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినా వాటిలో కూడా పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. గత ఏడాది నవంబర్‌లో గ్రూప్‌ -2 పరీక్ష నిర్వహించినా నేటికి వాటి ఫలితాలు విడుదల చేయలేదు. ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతుండడంతో... అసలు గ్రూప్‌ -2 పోస్టులను భర్తీ చేస్తారా? లేదా? అన్న ఆందోళన నిరుద్యోగుల్లో మొదలైంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల మీద యువతలో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో వారంతా వలసబాట పడుతున్నారు. స్వరాష్ట్రంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ ఉద్యోగాలు దొరకకపోవడంతో నిరుద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొంతమంది స్వయం ఉపాధి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదు.

రెండు లక్షల ఖాళీలు..
రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గ్రూప్‌ -1లో 1200 పోస్టులు, గ్రూప్‌ -3లో 8వేల ఉద్యోగాలు, గ్రూప్‌ -4లో 36వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక 40వేల టీచర్‌ పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. వీటితో పాటు 6వేల జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, 4500 ఎయిడెడ్‌ టీచర్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇవే కాకుండా .. లైబ్రేరియన్లు, పీఈటీ, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సర్కార్‌ మాత్రం ఇప్పటి వరకు కేవలం 3వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. గ్రూప్‌ -2లో 1000కిపైగా పోస్టులకు పరీక్ష కూడా నిర్వహించింది. ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. గురుకుల టీచర్స్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసి... ఆ తర్వాత రద్దు చేసింది. ఇంత వరకు మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ ఊసేలేదు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు , మండలాల్లో పోస్టుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఖాళీగా ఉన్న పోస్టులను ఆయాశాఖల్లోని ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు తప్పితే... భర్తీ మాత్రం చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఆగ్రహంతో పెల్లుబిగుతోంది. అధికారం చేపట్టి మూడేళ్లైనా ఉద్యోగాల భర్తీ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే మరో ఉద్యమం తప్పదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

Don't Miss