ఉద్దానంలో సంక్షోభంలో కొబ్బరి సాగు

11:49 - September 2, 2017

శ్రీకాకుళం: ఏటా కోట్లలో ఆదాయాన్ని సమకూర్చి... లక్షలాది మందికి జీవనాధారమైన కొబ్బరి తోటలు నేడు కనుమరుగవుతున్నాయి. తుఫాన్‌లు..తెగుళ్లతో...చెట్లు నేలమట్టమై.. రైతులకు కంట నీరు నింపుతున్నాయి. మరో కోనసీమగా పేరొందిన ఉద్దానంలో కొబ్బరి సాగు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. శనివారం ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా 10TV ప్రత్యేక కథనం.

ప్రశ్నార్థకమైన లక్షలాదిమంది జీవనాధారం

సిక్కోలు జిల్లాలో... కొబ్బరి సాగు సంక్షోభంలో పడింది. ఏటా 60 కోట్ల రూపాయల టర్నోవర్‌... నేడు 30 కోట్లకు పడిపోయింది. దిగుబడులు గణనీయంగా తగ్గి...లక్షలాదిమంది జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. తెగుళ్లు.. తుఫాన్‌లు.. దళారుల వల్ల.. కొబ్బరి రైతులు...దీన స్థితిలో పడిపోయారు.

కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, వజ్రపు కొత్తూరు...

ఉద్దాన ప్రాంతంగా పిలువబడే కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, వజ్రపు కొత్తూరు, పలాస మండలాలతో పాటు.. గార, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో 35 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి 25 లారీల కొబ్బరి కాయలు ఎగుమతి అవుతుంటాయి. అయితే దశాబ్ద కాలంగా కొబ్బరి సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. తెగుళ్లు, తుఫానుల ప్రభావంతో సగానికి పైగా చెట్లు నేలమట్టం అయ్యాయి. దిగుబడి గణనీయంగా పడిపోయింది. కొబ్బరి కాయలు సైజు తగ్గిపోవడం... దళారుల ప్రాబల్యం పెరిగిపోవడంతో.. కొబ్బరి రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. మూడేళ్ల కిందట సంభవించిన పైలిన్ తుఫానుతో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని 45 కోట్ల రూపాయలుగా అంచనా వేసిన అధికారులు...ఇప్పటికీ పూర్తి స్థాయి పరిహారం చెల్లించలేదు.

ప్రత్యేక ప్యాకేజి.. దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి...

దీంతో ఉద్దాన ప్రాంత కొబ్బరి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం... ప్రత్యేక ప్యాకేజి.. దీర్ఘకాలిక రుణాలు.. అందించాలని రైతులు కోరుతున్నారు. స్థానికంగా కొబ్బరి పరిశోధన కేంద్రం అందుబాటులోకి తేవాలంటున్నారు. ఇప్పటికైనా పాలకులు... ఉద్దానంలోని కొబ్బరి సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Don't Miss