కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధం

21:15 - September 1, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌3న ఆదివారం ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. దత్తాత్రేయను కూడా రాజీనామా చేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కోరగా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ఆయన స్థానంలో మురళిధర్‌రావును నియమించే అవకాశం ఉంది. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రులు చెబుతున్నారు. మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్రమోది చైనా పర్యటనకు ముందు కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 3న ఆదివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గురువారం రాత్రి ఆలస్యంగా నలుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, ఉమా భారతి, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే, సంజీవ్‌ బలియాన్‌ తమ రాజీనామా పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదికి పంపారు. రాధా మోహన్‌సింగ్‌, కల్‌రాజ్‌ మిశ్రాలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. 75 ఏళ్లు దాటితే పదవులకు దూరంగా ఉండాలన్న బిజెపి నియమం మేరకు 76 ఏళ్ల మిశ్రా రాజీనామా చేయనున్నారు.

మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నది తన నిర్ణయం కాదని, పార్టీ నిర్ణయమని మాజీ కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తెలిపారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

రాజీనామా ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదని మాజీ మంత్రి సంజీవ్ బలియాన్‌ అన్నారు. పార్టీ ఆదేశాలను పాటించడంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు.

తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు వ‌స్తున్న వార్తల‌ను ఉమాభార‌తి ఖండించారు. అస‌లు ఆ అంశం త‌న దృష్టికే రాలేదని.. రాజీనామా అంశంపై తానేమీ మాట్లాడ‌లేన‌ని ఉమాభారతి ట్వీట్‌ చేశారు. దీనిపై సమాధానం పార్టీ చీఫ్‌ అమిత్‌ షానే చెబుతారని పేర్కొన్నారు.

మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని మోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పార్టీ రూపొందించిన కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను మంత్రులు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారన్నది బేరీజు వేసుకుని కొందరు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. కనీసం 10 మంది మంత్రులపై వేటు పడే అవకాశముందని సమాచారం. మరికొద్ది నెలల్లో గుజరాత్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేయాలని బిజెపి భావిస్తోంది.

ఇప్పటికే మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ఎన్డీయేలో కొత్తగా చేరిన మిత్రపక్షాలకు పదవులు ఇస్తారని తెలుస్తోంది. జెడియుకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అన్నాడిఎంకెకు కాబినెట్‌ విస్తరణలో చోటు దక్కొచ్చు.  వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్‌ దవే మరణం, మనోహర్‌ పరీకర్‌ గోవా సీఎంగా వెళ్లడంతో మూడు శాఖలు ఖాళీ అయ్యాయి.  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు కూడా తన రాజీనామా అంశాన్ని ప్రధానికి ప్రస్తావించారు. అరుణ్‌జైట్లీ, నరేంద్రసింగ్‌ తోమర్, హర్షవర్ధన్‌, స్మృతీ ఇరానీల వద్ద రెండేసి శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రుల శాఖలు మార్చడంతో పాటు కొత్త ముఖాలకు చోటు దక్కనుంది. 

Don't Miss