అక్షరాలు దిద్దుతున్న పసి చేతులు...

12:14 - November 11, 2017

నాగర్ కర్నూలు : అనాథ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాలలు సరస్వతీ నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. పొట్టకూటి కోసం పనిచేసిన పసి చేతులు అక్కడ అక్షరాలు దిద్దుతున్నాయి. పేద పిల్లలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ కస్తూర్భా పాఠశాలపై ప్రత్యేక కథనం. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. 2008 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పాఠశాలలో సకల వసతులు ఉన్నాయి. అందమైన పాఠశాల భవనం, పచ్చని చెట్లతో పాఠశాల ప్రాంగణం ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తుంది. పాఠశాల గోడలపై దేశనాయకుల చిత్రాలు, విద్యార్థుల సృజనాత్మకత శక్తిని పెంచే చిత్ర పటాలు దర్శనమిస్తాయి. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఇక్కడ ప్రస్తుతం 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు.

ఈ కస్తూర్భాలో ప్రస్తుతం 197 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం లంబాడి తండాల నుండి వచ్చిన అనాథ పిల్లలే ఉంటారు. విద్యార్థులకు ఎలాంటి లోటు కలగకుండా పాఠశాల సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. ఆహారంలో గుడ్లు, పండ్లతో పాటు ప్రతి నిత్యం నాణ్యమైన భోజనం అందిస్తారు. విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇక్కడి పాఠశాల యాజమాన్యం తమని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. అనాథలుగా ఉన్న తమకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తామంటున్నారు విద్యార్థినిలు. చదువులో మాత్రమే కాదు ఆటపాటల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామంటున్నారు కస్తూర్భా యాజమాన్యం. ఇక్కడికి వచ్చే విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటామని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న అనాధపిల్లలకు ఆశ్రమంలా నిలుస్తున్నాయీ కస్తూర్భాలు. ప్రభుత్వం ఇలాంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థినులు ఉన్నత స్థానానికి చేరాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. 

Don't Miss