మద్యం నగరంగా విజయవాడ

07:46 - September 12, 2017

కృష్ణా : కృష్ణా, గుంటూరు జిల్లాలో మద్యం వెల్లువలా ప్రవహిస్తోంది. రెండు జిల్లాలో మొత్తం 695 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 162 బార్లు, రెండు పబ్‌లు ఉన్నాయి. ఈ మేరకు 2017 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల వ్యవధిలో కృష్ణా జిల్లాలోనే 681.68 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే దాదాపు రూ.300 కోట్లకు పైబడి అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్టానుసారంగా మద్యం షాపులు పెట్టడంతో... మహిళలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో యువత పెడదోవ పడుతుందని ఆవేదన చెందుతున్నారు. మద్యం మైకంలో అనేక మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు. మద్యం విక్రయాలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చౌక మద్యం ధరలు మినహా మిగతా ప్రీమియం బ్రాండ్ల ధరలు స్వల్పంగా పెంచేశారు. ఈ మేరకు క్వార్టర్‌పై రెండు రూపాయలు నుంచి ఐదు రూపాయలు వరకూ పెరిగింది. తాజా ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం చేరనుంది. 

Don't Miss