సర్కార్ లో అసహనం..మరో పక్క పాదయాత్ర..

20:23 - November 3, 2017

పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు.. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్రకు అడ్డంకులున్నాయా? ప్రభుత్వం అడ్డుపడుతుందా? లేక సవ్యంగా సాగి... ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్పం కోసం జగన్ ప్రయత్నిస్తారా? దీనిపై ప్రత్యేక కథనం.. ఎన్ని మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టినా, పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్ష లాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరించింది. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు విపక్షనేత. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకున్న చంద్రబాబు.. ఇప్పుడా పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. ఓ వైపు ఇడుపుల‌పాయ‌లో ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతుండ‌గా మ‌రోవైపు రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేత‌లు విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేశారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది? ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యమేమిటి? అధికారపక్షాన్ని ఎండగడుతూ, వచ్చే ఎన్నికలే టార్గెట్ జగన్ ముందుకు సాగనున్నారా? పాదయాత్ర షెడ్యూల్ దగ్గరకొచ్చేకొద్దీ ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. జగన్ యాత్రను ఆపే ప్రయత్నంలో ఏపీ సర్కారు ఉందా? తెలుగు నేల ఇప్పటికే పలు పాదయాత్రలను చూసింది. అధికారంలోకి తెచ్చిన అడుగులను, తమ అభిమాన్ని కొల్లగొట్టిన యాత్రలను అనేకం చూశారు ఏపీ ప్రజలు. మరి జగన్ పాదయాత్ర తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? గత పాదయాత్రల అనుభవాలు ఏం చెప్తున్నాయి?

రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు..అధికారపక్షం మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితి..రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు పై ఎత్తులు, అరచేతిలో వైకుంఠం చూపటం తప్ప వాస్తవంగా జరుగుతున్నది శూన్యం అనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశం, రైతుల సమస్యలు, ఇలా ఏపీని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రాజకీయ రంగంలో విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతిసవాళ్లూ మామూలే. అదే సమయంలో అధికారం కోసం నేతలు చేసే ప్రయత్నాలూ సాధారణమే. ఇవేవీ ప్రజల దృష్టి నుండి దూరంగా పోయేవి కాదు. కానీ, ఏం మాట్లాడుతున్నా, ఏ యాత్రలు చేస్తున్నా, అడ్డుకున్నా ప్రజలకు అందాల్సిన సంకేతాలు అందుతూనే ఉంటాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss