హృదయాలు దోచుకుంటున్న యువ హీరో...

12:18 - November 11, 2017

చెన్నై : పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. కానీ తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నాడు ఆ తమిళ హీరో. తను తీసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ కాలంలోనే సినీ రంగ ప్రవేశం చేసి ప్రజల హృదయాలను దోచుకుంటున్న ఆ యువ హీరోపై 10టీవీ కథనం. తమిళ నాట పట్టుమని పది సినిమాల్లో కూడా నటించలేదు.. కానీ ప్రజల గుండెల్లో సహజ నటుడిగా, ప్రజల నటుడిగా నిలిచి పోతున్నాడు. తాను సంపాదిస్తున్నదంతా ప్రజల ద్వారా వచ్చిందేనని అంటున్నాడు.. అందుకే ఆ డబ్బుతో విద్యార్ధులకు, వికలాంగులకు, రైతులకు అవసరమయ్యే నిత్యవసరాల్ని అందిస్తానని ప్రకటించాడు. 

తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన నటుడినేనని.. తాను పేదల కష్టాలను అర్ధం చేసుకోగలనని విజయ్‌ సేతుపతి తెలిపారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాడు. ఇటీవల అనిల్‌ సేమియా కంపెనీ యాడ్‌లో నటించి 50లక్షల రూపాయల చెక్కుని పారితోషికంగా అందుకున్నాడు. ఆ చెక్కును కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌కి అందచేసి విద్యలో వెనుకబడిన జిల్లాలో నీట్‌కు బలైన అనిత పేరున అంగన్‌ వాడీ కేంద్రాలకు, పేద వికలాంగ విద్యార్ధులకు వినియోగించాలని విజయ్‌ సేతుపతి కలెక్టర్‌ని కోరారు. ఇదంతా నా పబ్లిసిటీ కోసం చేసుకోవటం లేదని.. ఇది చూసి కొందరైనా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తారనే ఆకాంక్షను విజయ్‌ సేతుపతి వ్యక్తంచేశారు. తాను కష్టపడి సంపాదించే డబ్బును దాన ధర్మాలకు వినియోగిస్తూనే.. ఇలా పెద్దమొత్తంలో డబ్బును పేదలకు అందచేస్తున్న విజయ్‌ సేతుపతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

Don't Miss