సంగీతకు ఊరట

07:40 - January 12, 2018

హైదరాబాద్ : భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న సంగీతకు తొలి విజయం లభించింది. మియాపూర్‌ కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సంగీత భర్త ఇంటి తాళాలను పగులగొట్టి .. లోపలికి ప్రవేశించింది. ఈ సందర్భంగా.. ఆమె న్యాయస్థానానికి, సహకరించిన మహిళా సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. 
మియాపూర్‌ కోర్టులో సంగీతకు అనుకూలంగా తీర్పు 
బోడుప్పల్లో  భర్త ఇంటిముందు.. న్యాయం కోసం పోరాడుతున్నసంగీతకు కోర్టులో ఊరట లభించింది. దీంతో సంగీత.. భర్త ఇంట్లోకి ప్రవేశించింది.  మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టులో గురువారం సంగీత కేసు విచారణకు వచ్చింది. సంగీతకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. సంగీతకు నెలవారీ ఖర్చు కింద ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి 20 వేల రూపాయలు ఇవ్వాలని  మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇప్పటివరకు శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న ఇంట్లోనే సంగీత ఉండాలని తేల్చి చెప్పింది.  భర్త, అత్త, మామలు ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలింగిచరాదని కోర్టు స్పష్టం చేసింది. 
కోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేసిన భర్త శ్రీనివాస్‌రెడ్డి
అయితే కోర్టు తీర్పుపై  సంగీత భర్త శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌ దాఖలు చేశాడు. ఇంట్లోకి అనుమతించిన తర్వాత సంగీతకు డబ్బులు ఇవ్వడం దేనికంటూ శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడున్న ఇల్లు తనది కాదని.. వేరే ఇంట్లోకి మారడానికి అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు. అయితే శ్రీనివాస్‌రెడ్డి వేసిన కౌంటర్‌ పిటిషన్‌ను కొట్టి వేయడం జరిగింది. 
ఇంట్లోకి ప్రవేశించిన సంగీత  
కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సంగీత..  భర్త శ్రీనివాస్‌రెడ్డి.. ఇంటి తాళాలను పగులగొట్టి.. లోపలికి ప్రవేశించింది.  ఈ సందర్భంగా సంగీత న్యాయ స్థానానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే భర్త శ్రీనివాస్‌రెడ్డిపై పెట్టిన  కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.  భర్తపై పూర్తి నమ్మకం కలిగిన రోజున కేసులు ఎత్తివేస్తారని ఆమె అన్నారు. అలాగే తన పోరాటానికి మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా తన భర్తలోమార్పు వచ్చేంత వరకూ.. తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని..సంగీత స్పష్టం చేశారు.  
 

 

Don't Miss